క్రికెట్ మైదానంలో ప్రత్యర్థులతో వాగ్వాదానికి దిగినప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడు ఇష్టమే అయినా.. అతను అదుపులో ఉండాలని మాజీ కీపర్, బ్యాట్స్‌మన్ ఫరూక్ ఇంజినీర్ సూచించాడు. అనవసర విషయాలకు వెళ్లి పరిస్థితులు చేయిదాటిపోయేలా చేసుకోవద్దన్నాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే పలు సందర్భాల్లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు తమ నోటికి పనిచెప్పారు. దాంతో కెప్టెన్ విరాట్ సైతం అంతే దీటుగా వారికి జవాబిచ్చాడు. ఈ విషయంపైనే ఫరూక్ ఇంజినీర్ స్పందించాడు.
"ప్రత్యర్థులతో దూకుడుగా ఉండే విషయంలో నేను కోహ్లీని ఎంతో ఇష్టపడతాను. అతడో స్ఫూర్తిదాయక సారథి. ఎల్లప్పుడూ మైదానంలో చురుగ్గా ఉంటాడు. ఎవరైనా అలాగే ఉండాలి. అయితే, అది పరిమితులకు మించి ఉండకూడదు. లేకపోతే అంపైర్లు లేదా మ్యాచ్ రిఫరీలు కలుగజేసుకుంటే వివాదం పెద్దది అవుతుంది. అలాగే విరాట్ కొన్నిసార్లు తన కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. కానీ, నాకు అతడి తీరు ఎంతో ముచ్చటేస్తుంది. అతడో మేటి సారథి. అందులో ఎలాంటి అనుమానం లేదు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అతడు" అంటూ ఫరూక్ పొగడ్తల వర్షం కురిపించాడు.