ఏడాది మార్చిలో నిర్వహించనున్న మహిళల ఐపీఎల్ (డబ్ల్యూఐపీఎల్) కోసం బీసీసీఐ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. తొలుత ఐదు జట్లతో ఈ లీగ్‌ను ప్రారంభించనుంది. ఈ మెగాలీగ్‌లో పాల్గొనే ఐదు ఫ్రాంచైజీలను జనవరి 25న బీసీసీఐ ఎంపిక చేయనుంది. ఫ్రాంచైజీలకు సంబంధించిన ఆర్థిక బిడ్లను ఇప్పటికే బీసీసీఐ సీల్ చేసింది. అదే రోజు వీటిని తెరవనుంది. అయితే బీసీసీఐ 'అత్యున్నత ద్రవ్య ప్రతిపాదనను అంగీకరించాల్సిన అవసరం లేదు' అని టెండర్ పత్రంలో తెలిపింది.
డబ్ల్యూఐపీఎల్ ఐదు ఫ్రాంచైజీలను, వేదికలను సొంతం చేసుకోవడానికి బీసీసీఐ గతవారం బిడ్లను ఆహ్వానిస్తూ టెండర్ విడుదల చేసింది. బిడ్డర్లు ఒకటి కంటే ఎక్కువ ఫ్రాంచైజీలకు, నగరాలకు పోటీ పడవచ్చు. కానీ అంతిమంగా విజయవంతమైన బిడ్డర్‌కు ఒక ఫ్రాంచైజీ మాత్రమే దక్కుతుంది. ఒకే వేదిక కోసం రెండు అత్యధిక బిడ్లు ఒకే ధర నిర్ణయిస్తే బీసీసీఐ మళ్లీ బిడ్ నిర్వహిస్తుంది. రెండు వేదికలకు ఇద్దరు బిడ్డర్లు అత్యధిక ధరతో బిడ్ వేస్తే ఆ ఉత్తర్వులను నిర్ణయించే విచక్షణాధికారం బీసీసీఐకి ఉంటుంది. ఒక బిడ్డర్ ఒకటి కంటే ఎక్కువ వేదికలకు ఎక్కువ మొత్తంతో బిడ్ వేస్తే వేదికను నిర్ణయించే స్వేచ్ఛ బీసీసీఐకి ఉంటుంది.