తెలంగాణ

telangana

ETV Bharat / sports

FIFA అభిమానులకు కొత్త వైరస్‌ ముప్పు.. వివిధ దేశాల అధికారులు అలెర్ట్ - ఫిఫా అభిమానులకు మరో కొత్త వైరస్‌ ముప్పు

కేమెల్ ఫ్లూ లేదా మెర్స్‌ వైరస్‌గా పిలిచే ఈ వైరస్‌ను తొలిసారిగా 2012లో సౌదీ అరేబియాలో గుర్తించారు. ఇది కరోనా మహమ్మారి స్థాయిలో వ్యాపించగలదని డబ్ల్యూహెచ్‌వో సైతం హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల అధికారులు అప్రమత్తమయ్యారు.

fifa fans facing camel flu
ఫిఫా అభిమానులకు కొత్త వైరస్‌

By

Published : Dec 12, 2022, 10:34 PM IST

Fifa Fans Facing Camel Flu Virus : ఫిఫా వరల్డ్‌ అభిమానులకు మరో కొత్త వైరస్‌ ముప్పు పొంచి ఉందని ఆరోగ్యరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖతార్‌లో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు చూసి స్వదేశాలకు వస్తోన్న అభిమానులు ద్వారా ఈ ఫ్లూ ఆయా దేశాల్లో వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కేమెల్‌ ఫ్లూ లేదా మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేట్రీ సిండ్రోమ్‌గా పిలిచే ఈ వైరస్ ఒంటెల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని తెలిపారు.

ఈ మేరకు ఆస్ట్రేలియన్‌ ఆరోగ్యమంత్రిత్వశాఖ తమ దేశ ప్రజలకు కొన్ని సూచనలు చేసింది. ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూసేందుకు వెళ్లినవారు ఒంటెలకు దూరంగా ఉండాలని, వండని మాంసాన్ని తినడం, పాశ్చరైజ్‌ చేయని పాలు తాగడం చేయవద్దని సూచించింది. బ్రిటన్‌ ఆరోగ్యభద్రత సంస్థ సైతం జ్వరం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న వారికి పరీక్షలు నిర్వహించి, వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లను ఆదేశించింది.

ఏంటీ మెర్స్‌ వైరస్?
మెర్స్‌-కొవ్‌ లేదా కేమెల్‌ ఫ్లూ, యూకేహెచ్‌ఎస్‌ఏ నివేదిక ప్రకారం 2,600 లేబొరేటరీలు ఈ వైరస్‌ను నిర్ధరించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం 2012 ఏప్రిల్‌ నుంచి 2022 అక్టోబరు వరకు ఈ వైరస్‌ సోకినవారిలో 35 శాతం మంది మృత్యువాతడ్డారు. తొలిసారిగా ఈ వైరస్‌ను 2012లో సౌదీ అరేబియాలో గుర్తించారు. ఇప్పటిదాకా ఈ వైరస్‌ మిడిల్‌ఈస్ట్‌ దేశాలతోపాటు దక్షిణాసియా, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది.

2012 నుంచి ఇప్పటిదాకా సుమారు 27 దేశాల్లో ఈ వైరస్ వెలుగుచూసింది. ఈ వైరస్ సోకిన వ్యక్తిలో జ్వరం, దగ్గు, డయేరియా వంటి లక్షణాలతోపాటు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతాయి. వృద్ధుల్లో, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో, క్యాన్సర్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేవారిలో, డయాబెటిస్ బాధితుల్లో ఇది ప్రాణాంతకంగా మారుతుందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

ఖతార్‌లో ఫిఫా వరల్డ్ కప్ చూసేందుకు వివిధ దేశాల నుంచి ఫుట్‌బాల్‌ అభిమానులు వచ్చి వెళుతున్న నేపథ్యంలో వారి ద్వారా వైరస్‌ ఆయా దేశాలకు వ్యాపించే ప్రమాదం ఉందని ఆరోగ్యరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లోని అధికారులు అప్రమత్తమయ్యారు. మెర్స్ ను తక్కువగా అంచనా వేయరాదని, కరోనా మహమ్మారి స్థాయిలో వ్యాపించగలదని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details