సారథికి, మేనేజ్‌మెంట్‌కు సన్నిహితంగా ఉన్న ఆటగాళ్లకే పాకిస్థాన్ జట్టులో భవిష్యత్తు ఉంటుందని ఎడమచేతి వాటం పేసర్ జునైద్‌ఖాన్ ఆరోపించాడు. పాక్ జట్టులోని ఆటగాళ్లు అభద్రతాభావంతో ఉన్నారని విమర్శించాడు. 22 టెస్టులు, 76 వన్డేలు, 8 టీ20ల్లో 190 వికెట్లు తీసిన 31 ఏళ్ల జునైద్‌ను 2019 మే తర్వాత ఏ ఫార్మాట్‌లోనూ పాక్ జట్టుకు ఎంపిక చేయలేదు.
'సారథికి సన్నిహితంగా ఉంటేనే జట్టులో చోటు' - పీసీబీపై మండిపడ్డ పాక్ పేసర్ జునైద్ ఖాన్
కెప్టెన్‌కు, మేనేజ్‌మెంట్‌కు దగ్గరగా ఉంటేనే పాకిస్థాన్ జట్టులో చోటు దక్కుతుందని ఆరోపించాడు పేసర్ జునైద్ ఖాన్. నచ్చినవాళ్ల కోసం తనను పక్కనపెట్టారని వెల్లడించాడు.
జునైద్ ఖాన్
"కెప్టెన్, జట్టు మేనేజ్‌మెంట్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నవాళ్లకే భవిష్యత్తు ఉంటుంది. జట్టు తరఫున సత్తాచాటేందుకు అన్ని ఫార్మాట్లలో అవకాశం లభిస్తుంది. మంచి సంబంధాలు లేకపోతే జట్టులోకి వస్తూ పోతుంటారు. ఒకప్పుడు మూడు ఫార్మాట్లలో జాతీయ జట్టులో ఉన్నా. ఒక్కోసారి విశ్రాంతి అడిగినా ఇచ్చేవారు కాదు. కొంతకాలం తర్వాత నాపై చెడ్డవాడనే ముద్రవేశారు. నచ్చినవాళ్ల కోసం నన్ను పక్కనబెట్టారు. నేను సత్తాచాటుతున్నా సరైన అవకాశాలు ఇవ్వలేదు" అని జునైద్ ఆరోపించాడు.