Fans Reaction on Kohli ODI Captaincy: దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో టీమ్ఇండియా వన్డే జట్టుకు సారథిగా రోహిత్ శర్మను నియమిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే.. విరాట్ కోహ్లీని తొలగిస్తూ ఊహించని విధంగా బీసీసీఐ ఈ ప్రకటన చేయడంపై ట్విట్టర్లో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు అభిమానులు ఈ నిర్ణయాన్ని స్వాగతించగా.. మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై కూడా మండిపడుతున్నారు.
"రోహిత్ శర్మను టీ20లతో పాటు వన్డే జట్టుకు కూడా సారథిగా నియమించాలని ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది." అని బీసీసీఐ బుధవారం తమ ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే.. విరాట్ కోహ్లీ తానే స్వయంగా తప్పుకుంటున్నట్లు కమిటీకి చెప్పాడా? లేదా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
ఫ్యాన్స్ ట్వీట్లు..
'విరాట్ కోహ్లీని ఎందుకు తొలగించారు? 95 వన్డేల్లో 65 విజయాలు సాధించాడు. ఇది సరిపోదా? ప్రపంచకప్లో ఓడిపోవడమే కారణమా? ధోనీ, గంగూలీ ప్రపంచకప్ ఓడిపోయిన సందర్భాలు లేవా? ఇది భారత క్రికెట్కు మంచిదికాదు.' అని ఓ అభిమాని ట్వీట్ చేశాడు.
'ఈ నిర్ణయం.. ఒకరకంగా విరాట్ కోహ్లీని అవమానించడమే. బీసీసీఐకి థాంక్యూ అని చెప్పాలని అనిపించట్లేదు. షేమ్ ఆన్ యూ బీసీసీఐ, జై షా, గంగూలీ.' అని మరో అభిమాని ట్వీట్ చేశాడు.