Dhoni Sunil gavaskar: చెన్నై సారథి మహేంద్రసింగ్ ధోనీ వచ్చే ఏడాది కూడా భారత టీ20 లీగ్ ఆడతానని స్పష్టం చేయడంతో అతడి అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఇన్నేళ్లుగా చెన్నై టీమ్‌కు ఎంతో అండగా నిలిచిన అభిమానులకు సొంత మైదానంలో కృతజ్ఞతలు చెప్పకుండా వెళ్లడం మంచిది కాదని భావించి ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఇప్పటికే ధోనీ వయసు 40 ఏళ్లు కావడంతో ఈ సీజనే చివరిది కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో గతరాత్రి స్పష్టతనిచ్చాడు. దీనిపై సునీల్ గావస్కర్ స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశాడు.
"ధోనీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. అతడు చెప్పినట్లు ఇన్నాళ్లూ తనని, తను నడిపించిన చెన్నై జట్టుని, ఆదరించిన అభిమానులకు వచ్చే ఏడాది సొంత మైదానంలో కృతజ్ఞతలు తెలియజేయాలనుకోవడం అభినందనీయం. అతడు కేవలం చెన్నైకే కాకుండా టీమ్‌ఇండియాకూ నాయకత్వం వహించాడు. భారత జట్టును అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లాడు. ఇక వచ్చే ఏడాది ఈ లీగ్ దేశవ్యాప్తంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రతి జట్టూ ఇంటా బయట మ్యాచ్‌లు ఆడే పరిస్థితులు వస్తాయని ఆశిస్తున్నా. ఇప్పుడు మొత్తం 10 జట్లు ఉండటంతో తర్వాతి సీజన్‌లో పది వేదికల్లోనూ అభిమానులకు కృతజ్ఞతలు చెప్పి వీడ్కోలు పలకొచ్చు. దీంతో ఒకేసారి దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ధన్యవాదాలు చెప్పినట్లు అవుతుంది’ అని గావస్కర్ వివరించాడు.
Sunil gavaskar shimron hetmyer: బ్యాటింగ్ దిగ్గజం, టీమ్‌ఇండియా మాజీ సారథి సునీల్ గావస్కర్‌పై నెటిజన్లు, రాజస్థాన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిని వెంటనే భారత టీ20 లీగ్‌లో కామెంట్రీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. గతరాత్రి చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాట్స్‌మన్ షిమ్రన్ హెట్‌మెయర్‌పై సన్నీ చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. అవి అభ్యంతరకరంగా ఉన్నాయంటూ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.