ది హండ్రెడ్ లీగ్‌లో భాగంగా నార్తర్న్ సూపర్ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ కెప్టెన్, ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ విధ్వంసం సృష్టించాడు. 40 బంతుల్లో 10 భారీ సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 92 పరుగులు సాధించి తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఈ క్రమంలోనే అతడు బాదిన ఓ సిక్స్‌ను క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించి కుర్చీ మీద పడ్డాడు ఓ అభిమాని.
ఏం జరిగిందంటే?
లివింగ్‌స్టోన్ బాదిన ఓ సిక్స్ బౌండరీ దాటి ప్రేక్షకుల స్టాండ్స్‌లోకి వెళ్లింది. ఈ క్రమంలో ఆ బంతిని పట్టుకునేందుకు ప్రయత్నించి ముందు కుర్చీపై పడిపోయాడు ఓ అభిమాని. అయినా క్యాచ్ మాత్రం ఒడిసిపట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఈ సన్నివేశాన్ని కెమెరామెన్ తన కెమెరాలో బంధించగా ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన కొందరు అతడిని ప్రశంసలతో ముంచెత్తుతుంటే.. మరికొందరు అయ్యో పాపం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ 92 పరుగులతో పాటు 3 వికెట్లతో రాణించి ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ ఛార్జర్స్ జట్టుకు ఓపెనర్లు క్రిస్ లిన్(34), టామ్ కోహ్లర్(71) శుభారంభాన్ని అందించారు. కానీ మిగతావారు ఆకట్టుకోకపోవడం వల్ల ఛార్జర్స్ జట్టు నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.
అనంతరం 144 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఫీనిక్స్ జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ విల్ స్మీడ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ లివింగ్‌స్టోన్ వచ్చీ రాగానే బౌలర్లపై విరుచుకుపడుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఇతడికి ఓపెనర్ ఫిన్ అలెన్ (42) మద్దతుగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి 51 బంతుల్లో 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ఫీనిక్స్ జట్టు కేవలం 74 బంతుల్లోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా ఫైనల్‌కు అర్హత సాధించింది.