టీ20 ప్రపంచకప్ రసవత్తరంగా సాగుతోంది. సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవడానికి జట్లన్నీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. మెగా టోర్నీని కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తున్న జట్లను ఇప్పుడు ఓ ప్రధాన సమస్య వేధిస్తోంది. అదే ఓపెనింగ్ భాగస్వామ్యం. టీమ్ఇండియా నుంచి ఆస్ట్రేలియా వరకు దాదాపు అన్ని జట్లను ఓపెనింగ్ జోడిల వైఫల్యం వేధిస్తోంది. కీలకమైన పవర్ ప్లేలో భారీగా పరుగులు సాధిస్తారని ఆశలు పెట్టుకున్న బ్యాటర్‌లు తక్కువ పరుగులకే వెనుదిరగడం ఆయా జట్లలో ఆందోళనను పెంచుతోంది.
అంతా బాబర్ మయమే..
14....4....0... ఇవీ పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ టీ 20 ప్రపంచకప్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో నమోదు చేసిన స్కోర్లు. పాక్ జట్టు అతిగా ఆధారపడే బాబర్ ఆజమ్ వరుస వైఫల్యాలతో ఆ జట్టు ఈ మెగా టోర్నీ నుంచి. దాదాపు నిష్క్రమించింది. పాక్ ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా సెమీస్ చేరే అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి. దీనికి బాబర్ ఆజమ్ వైఫల్యాలు ప్రధాన కారణమన్న విమర్శలు ఉన్నాయి. బ్యాటింగ్ వైఫల్యంతో జింబాబ్వే విధించిన 130 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక పాక్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో కేవలం నాలుగు పరుగులకే వెనుదిరిగిన ఆజమ్ పాక్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు
కలవరపెడుతున్న రాహుల్ వైఫల్యాలు..
ఈ మెగా టోర్నీలో టీమ్ఇండియా ఓపెనర్ కె.ఎల్.రాహుల్ వైఫల్యాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు ఆడిన రాహుల్ 9,9,4 పరుగులు చేశాడు. కీలకమైన టోర్నీలో రాహుల్ వైఫల్యం. టీమ్ఇండియాకు శరాఘాతంగా మారుతోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో పర్వాలేదు అనిపించిన రాహుల్... పొట్టి ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ రెండంకెల స్కోరు చేయలేకపోయాడు. ఈ సమయంలో రాహుల్ స్థానంలో.. పంత్‌ను జట్టులోకి తీసుకోవాలన్న డిమాండ్‌లు బలంగా వినిపిస్తున్నాయి. సెమీస్ చేరాలంటే తర్వాతి రెండు మ్యాచ్‌లు కీలకమైన దశలో రాహుల్ ఇప్పటికైనా ఫామ్ అందుకుని పరుగుల వరద పారించాలని టీమ్ఇండియా కోరుకుంటోంది.