తెలంగాణ

telangana

By

Published : Jan 12, 2023, 1:48 PM IST

ETV Bharat / sports

'వన్డేల్లో కోహ్లీ 45 సెంచరీలు.. ఇప్పుడున్న ఆటగాళ్ల ఊహకు కూడా అందదు'

సెంచరీతో కొత్త ఏడాదిని ప్రారంభించిన విరాట్ కోహ్లీ శ్రీలంకతో రెండో వన్డే మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. ఈ మ్యాచ్‌లోనూ మరో శతకం బాది సచిన్‌ రికార్డుకు మరింత చేరువ కావాలని అభిమానులు కోరుతున్నారు. ఈ క్రమంలో కోహ్లీ బ్యాటింగ్‌ను పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు కమ్రాన్‌ అక్మల్‌ ప్రశంసించాడు.

virat kohli century
virat kohli

శ్రీలంకతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో వన్డే ఫార్మాట్‌లో 45వ శతకం అతడి ఖాతాలో పడింది. సచిన్‌కు (49) నాలుగు సెంచరీల దూరంలో ఉన్నాడు. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే మాత్రం ఈ ఏడాదే ఆ రికార్డును అధిగమించడం ఖాయం. కోహ్లీ బ్యాటింగ్‌ను పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు కమ్రాన్‌ అక్మల్‌ ప్రశంసించాడు. ప్రస్తుత సమయంలో 45 శతకాలను సాధించడం ఎవరికైనా కష్టమేనని వ్యాఖ్యానించాడు.

"శ్రీలంకపై విరాట్ అద్భుతంగా ఆడాడు. అతడు 45వ సెంచరీని పూర్తి చేయడం అభినందనీయం. అయితే, ప్రస్తుత కాలంలో ఎవరూ కూడా అన్ని ఫార్మాట్లు కలిపి 45 శతకాలు చేయగలమని ఊహించడం కూడా కష్టమే. కానీ, విరాట్ కేవలం వన్డేల్లోనే ఆ మార్క్‌ను అందుకోవడం సూపర్. ఇప్పటి వరకు టెస్టులు, వన్డేలు, టీ20ల్లో కలిపి 73 అంతర్జాతీయ శతకాలు నమోదు చేయడం ఇప్పుడున్న వారికి అసాధ్యం. కోహ్లీకి అవకాశాలు వచ్చాయి.. అయితే, వాటిని అందుకొని రాణించడం గొప్ప విషయం. విరాట్ మంచి ఫామ్‌లో ఉండటం వల్ల ఆసియా కప్‌, వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు పెద్ద సానుకూలాంశంగా మారుతుంది" అని అక్మల్‌ వెల్లడించాడు.

ఇదే ఫామ్‌ కొనసాగిస్తే..
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ ముగిశాక.. న్యూజిలాండ్, ఆసీస్‌ జట్లతోనూ వన్డే సిరీస్‌లు ఉన్నాయి. ఆసియా కప్‌ కూడా వన్డే ఫార్మాట్‌లోనే జరగనుంది. ఈ ఏడాది భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీ కూడా ఉంది. దాదాపు ఈ ఒక్క సంవత్సరమే విరాట్ కోహ్లీ మరో 15 వన్డేలు ఆడే అవకాశం ఉంది. దీంతో సచిన్‌ రికార్డును (49 సెంచరీలు) విరాట్ సులువుగానే దాటేస్తాడని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో నేడు శ్రీలంకతో రెండో వన్డే మ్యాచ్‌లో భారత్‌ తలపడనుంది.

ABOUT THE AUTHOR

...view details