Parthiv Patel On Rohit Sharma : ఇక నెల రోజుల్లో టీ20 ప్రపంచకప్ రానుంది.. ఇప్పటికే జట్లను ప్రకటించిన టాప్ టీమ్‌లు తమ బ్యాటింగ్ కాంబినేషన్లపై దృష్టిసారించాయి. ఇప్పటికే పలువురు మాజీలు తమ విశ్లేషణలకు పదును పెట్టారు. ఎంపిక చేసిన జట్టుపైనా.. తాము ఏమనుకుంటున్నామో వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ కూడా జట్టు కాంబినేషన్‌పై స్పందించాడు. టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అలాగే వీరిద్దరూ ఆటతీరు విభిన్నంగా ఉంటుందని పేర్కొన్నాడు.
"రోహిత్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. విరాట్ కోహ్లీ ఖాళీలను గుర్తించి బౌండరీలను తరలించడంలో స్పెషలిస్ట్. అందుకే వీరిద్దరూ కలిసి ఓపెనింగ్ చేయాలి. అప్పుడే జట్టుకు సమతూకం వస్తుంది. నేను ఆసియా కప్‌నకు ముందు కూడా ఇదే చెప్పా. విరాట్‌తో ఓపెనింగ్ చేయిస్తే బాగుంటుంది. ఆస్ట్రేలియా పరిస్థితుల్లో తొలి ఆరు ఓవర్ల ఆట చాలా కీలకం. ఆ పవర్‌ప్లే ఓవర్లలో విరాట్, రోహిత్ బ్యాటింగ్ చేస్తే కనీసం 50 పరుగుల మార్క్‌ను దాటేస్తారు. వికెట్ పడకుండా అలా పరుగులు చేస్తే మంచి స్కోరు సాధించే అవకాశం ఉంటుంది. ఫాస్ట్ పిచ్‌లకు కోహ్లీ సరిగ్గా సరిపోతాడు. కాబట్టే ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్లు తొలి ఆరు ఓవర్లలో బ్యాటింగ్ చేస్తే చూడాలని అనిపిస్తుంది" అని పార్థివ్ వివరించాడు. జట్టులో విరాట్ స్థానంపై ఎలాంటి సందిగ్ధత లేదని చెప్పాడు. ఫామ్‌తో సంబంధం లేకుండా జట్టులో ఉండాల్సిన ఆటగాడు కోహ్లీ అని వెల్లడించాడు.