భారత్, పాకిస్థాన్.. ఈ చిరకాల ప్రత్యర్థులు మైదానంలో విజయం కోసం హోరాహోరీగా తలపడతాయి. కానీ అది కేవలం ఆట వరకు మాత్రమేనని, వ్యక్తిగతంగా ఈ రెండు దేశాల క్రికెటర్ల మధ్య గొప్ప స్నేహ బంధం ఉందని మరోసారి స్పష్టమైంది. పవిత్ర కర్తార్‌పూర్ సాహిబ్ (గురుద్వారా)లో పాక్ మాజీ కెప్టెన్ ఇంతికాబ్ ఆలమ్‌తో టీమ్ఇండియా దిగ్గజం బిషన్ సింగ్ బేడి సరదాగా సమయాన్ని ఆస్వాదించడమే అందుకు నిదర్శనం. ఈ మాజీ ఆటగాళ్ల కలయిక విభిన్న భావోద్వేగాలకు వేదికైంది. సంతోషంతో నవ్వులు, బాధతో కన్నీళ్లు, పాటలు, మాటలు.. ఇలా వీళ్లు సమయాన్ని గడిపారు.
కొవిడ్ సోకిన తర్వాత కలిగిన దుష్పరిణామాల కారణంగా బిషన్‌కు గతేడాది హృదయ, మెదడు శస్త్రచికిత్సలు జరిగాయి. ప్రస్తుతం చక్రాల కుర్చీకే పరిమితమైన అతని జ్ఞాపకశక్తి క్షీణించింది. భార్య అంజుతో కలిసి తాజాగా అతను పాక్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్‌ను సందర్శించాడు. భారత్ నుంచి ఈ దంపతులు ఆ పవిత్ర స్థలాన్ని చేరుకోగా.. ముందుగానే అనుకున్న ప్రకారం పాకిస్థాన్‌లో మాజీ క్రికెటర్లు ఆలమ్, షఫ్కత్ రాణా వీళ్లను కలిశారు.