Team India Next Captain: భారత క్రికెట్ జట్టుకు తర్వాతి కెప్టెన్ ఎవరైతే బాగుంటుందో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సబా కరీం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మూడు ఫార్మాట్లలో విశేషంగా రాణిస్తున్న ఇద్దరి పేర్లను ఆయన ప్రస్తావించారు. వారే కేఎల్ రాహుల్, రిషభ్ పంత్. 'ఒకే ఆటగాడిని అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా కొనసాగించాలా లేదా అనేది సెలెక్టర్లు ముందుగా గుర్తించాలని నేను భావిస్తున్నా. అదే జరిగితే ఇద్దరి గురించి ప్రస్తావించవచ్చు. మొదటి ఎంపిక కేఎల్ రాహుల్. అతడు అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నాడు. రెండోది రిషభ్ పంత్. గత కొద్దికాలంగా అతడు అసాధారణ రీతిలో చెలరేగుతున్నాడు. అద్భుతమైన వైట్ బాల్ ప్లేయర్‌గా కూడా ఎదిగాడు' అని అన్నాడు.
ఓ టీవీ ఛానెల్‌లో ప్రసారమయ్యే 'స్పోర్ట్స్ ఓవర్ ది టాప్' కార్యక్రమంలో సబా కరీం మాట్లాడాడు. 'గాయం కారణంగా రోహిత్ శర్మ ఎంతకాలం కొనసాగగలడు అనేది ప్రధాన అంశం. కాబట్టి, ఈ విషయాలను కూడా పరిగణించాలి. ఓ యువ నాయకుడి గురించి అన్వేషిస్తే రిషభ్ పంత్ సరైన ఎంపిక. ఎందుకంటే అతడు చాలా ఏళ్లపాటు మూడు ఫార్మాట్లలో ఎంతో క్రికెట్ ఆడాల్సి ఉంది. భారత సెలక్టర్ల ముందున్న ప్రత్యామ్నాయాలు ఈ ఇద్దరు' అని మాజీ ఆటగాడు చెప్పుకొచ్చాడు.