తెలంగాణ

telangana

ETV Bharat / sports

పూర్తి ఐపీఎల్‌ మహారాష్ట్రలో!.. బీసీసీఐ మంతనాలు - ఐపీఎల్ మెగావేలం

IPL 2022: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది బీసీసీఐ. కేవలం ఒకే రాష్ట్రంలో లీగ్​ను నిర్వహించే అవకాశంపై మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది.

IPL 2022 in Maharashtra, IPL 2022 news, ఐపీఎల్ 2022 మహారాష్ట్ర, ఐపీఎల్ న్యూస్
IPL 2022

By

Published : Jan 11, 2022, 8:10 AM IST

IPL 2022: దేశంలో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్‌ నిర్వహణపై బీసీసీఐ ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తోంది. ఈసారి ఐపీఎల్‌ను పూర్తిగా మహారాష్ట్రలో నిర్వహించడంపై సాధ్యాసాధ్యాల్ని పరిశీలిస్తోంది. ముంబయిలోని వాంఖడే, బ్రబోర్న్‌, డీవై పాటిల్‌.. పుణెలోని ఎంసీఏ స్టేడియాల్లో ఐపీఎల్‌ నిర్వహణపై కసరత్తులు చేస్తోంది.

"ఈనెల 5న బీసీసీఐ తాత్కాలిక సీఈఓ, ఐపీఎల్‌ సీఓఓ హేమాంగ్‌ అమిన్‌.. ముంబయి క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) అధ్యక్షుడు విజయ్‌ పాటిల్‌ను సంప్రదించాడు. కొన్ని రోజుల అనంతరం ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ను అమిన్‌, పాటిల్‌ కలిశారు. బీసీసీఐ ప్రతిపాదనకు పవార్‌ పచ్చజెండా ఊపాడు. రానున్న వారం, పది రోజుల్లో బీసీసీఐ.. ఎంసీఏ అధికారులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేబాశిష్‌ చక్రవర్తిలను కలిసి ఐపీఎల్‌ నిర్వహణకు కావాల్సిన అనుమతులు కోరతారు. ప్రేక్షకులు లేకుండా కఠినమైన బయో బబుల్‌లో లీగ్‌ జరుగుతుంది కాబట్టి ఎలాంటి సమస్యలు రావు. ప్రస్తుతానికి ఐపీఎల్‌ను భారత్‌లోనే నిర్వహించాలన్నది బోర్డు ప్రణాళిక. భవిష్యత్తులో మహారాష్ట్ర వేదిక కూడా కుదరకపోతే ఐపీఎల్‌ను యూఏఈకి తరలించడం మినహా మరో మార్గం లేదు" అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

ఈ ఏడాది మరో రెండు కొత్త జట్లు లీగ్​లో బరిలో దిగబోతున్నాయి. దీంతో మొత్తం 10 జట్లతో లీగ్​ మరింత మజా ఇవ్వనుంది. ఇప్పటికే మెగావేలం నిర్వహణ కోసం పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ వేలం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇవీ చూడండి: కరోనా విజృంభణ.. సాయ్ కేంద్రాల మూసివేత

ABOUT THE AUTHOR

...view details