రివ్యూలు తీసుకునే విషయంలో టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీకి చెత్త రికార్డే ఉంది. తాజాగా.. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అది కొనసాగింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఉన్న మూడు రివ్యూలను వృథా చేసుకోవడం వల్ల కీలక సమయంలో వాటిని జట్టు ఉపయోగించుకోలేకపోయింది. ఇక ఇదే అదనుగా.. కోహ్లీపై ఇంగ్లాండ్ ప్రేక్షకులు ట్రోల్స్ చేశారు.
ఇదీ జరిగింది..
అంపైర్ నిర్ణయంపై సమీక్ష కోరేందుకు టీమ్ కెప్టెన్ రివ్యూ కోరే అవకాశముంటుంది. అయితే అది ఇన్నింగ్స్‌లో కేవలం మూడుసార్లకే పరిమితం. ఇందుకు.. చేతులతో సైగలు చేయాల్సి ఉంటుంది.
ఇక తొలి టెస్టు నాలుగో రోజు.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగింది ఇంగ్లాండ్ జట్టు. ఈ క్రమంలో ఉన్న రివ్యూలన్నీ వెంటవెంటనే వాడేశాడు కోహ్లీ. అవన్నీ వృథాగా పోవడం ఆందోళనకర విషయం. వాస్తవానికి రివ్యూలు చాలా కీలకం. సరైన సమయంలో వినియోగించుకుంటే మ్యాచ్ మలుపు తిరిగే అవకాశముంది. కానీ ఉన్న మూడింటినీ వృథా చేసుకున్న టీమ్ఇండియా.. ఆ తర్వాత అవసరమైనప్పుడు ఉపయోగించుకోలేకపోయింది. ఫలితంగా ఇంగ్లాండ్ మంచి స్కోర్‌ను సాధించగలిగింది.
అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది. స్టేడియంలో ఉన్న ఇంగ్లాండ్ ప్రేక్షకులు రివ్యూల విషయంలో విరాట్‌ను విపరీతంగా ట్రోల్ చేశారు. బంతి, బ్యాట్స్‌మన్ కాళ్లకి(ఎల్బీడబ్ల్యూ) తాకినప్పుడు 'రివ్యూ ఇవ్వు' అన్నట్టుగా చేతులతో సైగలు చేశారు. ఇవి స్టేడియంలోని కెమెరాలకు చిక్కగా..ఇప్పుడు అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
నాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో విజయానికి 157 పరుగుల దూరంలో ఉంది టీమ్ఇండియా. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 52/1 పరుగులు చేసింది. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 303 పరుగులకు ఆలౌటైంది.
ఇదీ చూడండి:-జడేజా ఖాతాలో మరో ఘనత.. ఆ జాబితాలో 5వ స్థానం