ఏడేళ్ల తర్వాత ఆడిన తొలి టెస్టులో ఇంగ్లాండ్‌తో పోరును డ్రాగా ముగించిన భారత మహిళల జట్టు.. ఇప్పుడదే జట్టుతో వన్డే సమరానికి సిద్ధమైంది. ప్రత్యర్థి గడ్డపై మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారమే తొలి వన్డే జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ప్రారంభంకానుంది.
గతేడాది టీ20 ప్రపంచకప్‌లో సంచలన బ్యాటింగ్‌తో అందరి దృష్టినీ ఆకర్షించి.. ఇటీవల తన తొలి టెస్టులోనూ ఇంగ్లాండ్‌పై గొప్పగా రాణించిన 17 ఏళ్ల ఓపెనర్ షెఫాలీ వర్మ ఈ మ్యాచ్‌తో వన్డేల్లోనూ అరంగేట్రం చేయనుంది. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ.. అలవోకగా భారీ షాట్లు ఆడగలిగే ఈ టీనేజీ బ్యాటర్ జట్టుకు అదనపు బలాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు. ఆమె రాకతో బ్యాటింగ్ ఆర్డర్లో కొత్త ఉత్సాహం రానుంది.
మెరుగ్గా ప్రారంభించాలని..
చివరగా సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ 1-4తో చిత్తయిన టీమ్ ఇండియా.. ఇప్పుడు ఇంగ్లాండ్‌పై మంచి ప్రదర్శనతో వచ్చే ఏడాది న్యూజిలాండ్లో జరిగే ప్రపంచ కప్ దిశగా సన్నాహకాలను మెరుగ్గా ప్రారంభించాలని ఆశిస్తోంది.