భారత్‌లో స్పిన్‌కు అనుకూలమైన మైదానాలే ఎక్కువ అని తెలిసినా.. దానిపై రాద్ధాంతం చేయడం తగదని అన్నాడు టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. గతంలో తమ జట్టు అనేక టెస్టుల్లో ఓడినా.. ఎప్పుడూ ఇలాంటి విమర్శలు చేయలేదని మీడియా సమావేశంలో వెల్లడించాడు.
"స్పిన్ ట్రాక్‌ల గురించి అనవసర వాదన జరుగుతోంది. స్పిన్ పిచ్‌లను మాత్రమే టార్గెట్ చేసుకొని విమర్శలు చేయడం తగదు. దురదృష్టకర విషయం ఏమిటంటే.. ప్రతి ఒక్కరూ వారికి అనుకూలమైన విషయాలను వార్తలుగా మలుస్తారు. ఒకవేళ ఆ టెస్టులో నాలుగో రోజున లేదా ఐదో రోజున మేము గెలిచి ఉంటే వాళ్ల అభిప్రాయం వేరుగా ఉండేది. అలాంటి వాటిపై ఎవరూ మాట్లాడరు. కానీ, మేము రెండు రోజుల్లోనే ఆటను ముగించామన్నది వాళ్ల ప్రధానసమస్య. దాన్నే ప్రస్తావిస్తున్నారే తప్పా.. మిగిలిన అంశాల గురించి మాట్లాడలేకపోతున్నారు".