ఇంగ్లాండ్‌తో శుక్రవారం నుంచి జరిగే చివరి టెస్టు(Ind Vs Eng 5th Test) కోసం టీమ్ఇండియా సన్నద్ధమవుతుంది. ఇప్పటికే 2-1 తేడాతో సిరీస్ ఆధిక్యంలోకి వెళ్లిన కోహ్లీసేన నిర్ణయాత్మక మ్యాచ్‌లోనూ అదరగొట్టి, సిరీస్ కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇది జరిగితే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో టెస్టు సిరీస్‌లు నెగ్గిన తొలి భారతీయ కెప్టెన్‌గా కెప్టెన్ కోహ్లీ(Kohli Records) రికార్డు సృష్టిస్తాడు. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేసి, పరువు నిలుపుకోవాలని రూట్‌సేన(England Cricket News) భావిస్తోంది.
టీమ్ఇండియా మార్పు ఖాయమా?
ఇంగ్లాండ్‌తో జరిగిన గత నాలుగు మ్యాచ్‌ల తరహాలోనే.. ఈ టెస్టుకు టీమ్ఇండియా కూర్పు(Indian Team in 5th Test) ఎలా ఉంటుందనే అంశమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో గడిచిన నెల కాలంలో 151 ఓవర్లు బౌలింగ్ చేసిన ఫాస్ట్ బౌలర్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే నిర్ణయాత్మక పోరు కావటం వల్ల బుమ్రాను ఆడించవచ్చనే వాదనలూ వినిపిస్తున్నాయి.
ఫిట్‌నెస్ సాధించిన మరో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమికి జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఉమేశ్ యాదవ్ నాలుగో టెస్టుల్లో ఆరువికెట్లతో సత్తాచాటడం, శార్దూల్ ఠాకూర్ బంతితో, బ్యాటుతో రాణించిన నేపథ్యంలో సిరాజ్ బెంచ్‌కు పరిమితమయ్యే సూచనలు ఉన్నాయి. ఒకవేళ బుమ్రాకు విశ్రాంతినిస్తే సిరాజ్‌కు అవకాశం దక్కొచ్చు.
అశ్విన్‌కు మళ్లీ నిరాశే!
స్పిన్నర్ అశ్విన్‌ను తీసుకోకపోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ నాలుగో టెస్టు చివరిరోజు మెరుగ్గా బౌలింగ్ చేసిన ఆల్‌రౌండర్ జడేజావైపే.. కోహ్లీ మొగ్గుచూపే అవకాశాలున్నాయి. వరుసగా విఫలమవుతున్న వైస్ కెప్టెన్ అజింక్యా రహానెకు ఆఖరి అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి.