ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఈ నెల 18 నుంచి 22 వరకు జరగనుంది. ఈ పోరులో టీమ్‌ఇండియా న్యూజిలాండ్ తలపడనున్నాయి. దీంతో పాటు టెస్టు సిరీస్లో ఆడేందుకు భారత మహిళల టీమ్ కూడా యూకే వెళ్లనుంది. సుదీర్ఘమైన క్వారంటైన్ కారణంగా ఆటగాళ్లు తమ కుటుంబాలను తీసుకెళ్లేందుకు బీసీసీఐ అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకోగా.. భారత జట్టు జూన్ 2న పయనం కానుంది. టీమ్ఇండియా ఆటగాళ్లతో పాటు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషా కూడా యూకే వెళ్లనున్నారు. అయితే వీరికి కూడా క్వారంటైన్ తప్పనిసరి అని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
"అవును.. ఆటగాళ్లతో పాటు వారి కుటుంబాలను యూకే తీసుకెళ్లేందుకు అనుమతించాం. అటు పురుషులతో పాటు మహిళల క్రీడాకారిణులకూ ఈ అవకాశాన్ని కల్పించాం. ఆటగాళ్లకు మానసికంగా ఎలాంటి మద్దతు కావాలో బీసీసీఐకి తెలుసు. అయితే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కోసం ఇంగ్లాండ్ వెళ్లే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషాకు కూడా క్వారంటైన్ తప్పనిసరి అని తెలుస్తోంది. ఆ దేశం క్వారంటైన్ రూల్స్ ప్రకారం ఆటగాళ్లకు నిర్బంధంలో కొంత సమయం తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది".