బ్యాట్స్‌మన్‌గా రిషభ్‌పంత్ సహజ ప్రతిభాశాలి అని టీమ్‌ఇండియా మాజీ వికెట్‌కీపర్ సయ్యద్ కిర్మాణి అన్నాడు. వికెట్‌కీపింగ్‌లో మాత్రం ఇంకా శైశవ దశలోనే ఉన్నాడని పేర్కొన్నాడు. వికెట్ల వెనకాల ప్రాథమిక అంశాల్లో అతడు మెరుగవ్వాలని సూచించాడు. తక్కువ వయసే కాబట్టి కాలం గడిచే కొద్దీ పరిణతి సాధిస్తాడని వెల్లడించాడు.
'రిషభ్ పంత్ ప్రతిభావంతుడు. సహజసిద్ధ స్ట్రోక్ ప్లేయర్. వికెట్ కీపింగ్‌లో ఇంకా శైశవ దశలోనే ఉన్నాడు. అతడెంతో నేర్చుకోవాలి. ఎప్పుడు రక్షణాత్మకంగా ఆడాలి, ఎప్పుడు దూకుడుగా ఆడాలో తెలుసుకోవాలి. వికెట్ కీపింగ్‌లో ప్రాథమికంగా సరిగ్గా ఉండాలి. ఇప్పుడలా లేడు. స్టంప్స్ సమీపంలో కీపింగ్ చేస్తున్నప్పుడే కీపర్ సత్తాను అంచనా వేయగలం. ఫాస్ట్ బౌలింగ్‌లో ఎవరైనా కీపింగ్ చేయగలరు. బంతి ఎలా వస్తుందో తెలుస్తుంది. సమయం ఉంటుంది. దూరంగా ఉంటారు. బంతిని బట్టి కదలొచ్చు, అందుకోవచ్చు.' అని కిర్మాణి అన్నాడు.