శనివారం నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు భారత్, ఇంగ్లాండ్‌లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న పర్యటక జట్టు అదే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. మరోవైపు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే భారత్ మిగిలిన మూడు టెస్టుల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకూడదు. రెండు టెస్టులు తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఈ మ్యాచ్‌కు 50 శాతం ప్రేక్షకులను కూడా అనుమతించనున్నారు.
స్పిన్నర్లకు పెద్దపీట..
ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ విజయంతో అత్యుత్సాహంతో ఉన్న భారత్‌కు.. సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు ఓటమి జీర్ణించుకోలేనిది. 227 పరుగుల తేడాతో భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. క్లిష్ట పరిస్థితుల్లో అసాధారణంగా రాణించగల కెప్టెన్ కోహ్లీ సహా సీనియర్లు ఉన్నా భారత్ ఓటమి పాలైంది.
ఇదిలా ఉండగా రెండో టెస్టు కోసం తయారు చేసిన చెపాక్ పిచ్ ఎక్కువగా స్పిన్నర్లకు సహకరించేదిగా ఉంది. తొలి రోజు నుంచే బంతి టర్న్ అయ్యే అవకాశముంది. దీంతో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు మరో ఎండ్‌లో తగిన సహకారం అందించే బౌలర్ కావాలి. గాయం నుంచి కోలుకున్న అక్షర్ పటేల్ మ్యాచ్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. వీరిద్దరూ రాణించాలని టీమ్ఇండియా కోరుకుంటోంది. మరో స్పిన్నర్‌నూ తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఆల్‌రౌండర్‌గా హర్దిక్..
ప్రస్తుతానికి బౌలింగ్ చేయనప్పటికీ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను ఆడించే అవకాశాల్ని కొట్టిపారేయలేం. స్పిన్నర్లపై వేగంగా పరుగులు చేయగలడని, 10 ఓవర్లు వేసినా సరిపోతుందని యాజమాన్యం భావిస్తోంది.
ఇంగ్లాండ్‌లో నాలుగు మార్పులు..
ఇంగ్లాండ్ జట్టులోనూ నాలుగు మార్పులు చేసింది. జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమవ్వగా.. అతని స్థానంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్‌కు స్థానం కల్పించింది యాజమాన్యం. పనిభారం తగ్గింపులో భాగంగా అండర్సన్‌కు విశ్రాంతినిచ్చి అతని బదులుగా స్టువర్ట్ బ్రాడ్‌ను తీసుకుంది. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన డామ్ బెస్‌ను సైతం తప్పించి మొయిన్ అలీకి చోటు కల్పించింది. తదుపరి మూడు టెస్టులకు వికెట్ కీపర్ జోస్ బట్లర్‌కు విశ్రాంతినిచ్చిన ఇంగ్లాండ్ బోర్డు బెన్ ఫోక్స్‌ను టీమ్‌లోకి తీసుకుంది.