తెలంగాణ

telangana

'టెస్టుల్లో ఇలాంటి బంతిని ఏ జట్టూ కోరుకోదు'

ఎస్జీ బంతుల నాణ్యత సరిగా లేదంటూ గతంలో అశ్విన్​ చేసిన అభిప్రాయాన్నే.. తాజాగా భారత కెప్టెన్​ కోహ్లీ వ్యక్తం చేశాడు. వీటికంటే కూకబురా లేదా డ్యూక్​ బంతులే బాగున్నాయని తెలిపాడు. టెస్టుల్లో ఇలాంటి బంతిని ఏ జట్టు కోరుకోదని పేర్కొన్నాడు.

By

Published : Feb 10, 2021, 7:31 AM IST

Published : Feb 10, 2021, 7:31 AM IST

Updated : Feb 10, 2021, 7:38 AM IST

kohli about sg cricket balls
'టెస్టుల్లో ఇలాంటి బంతిని ఏ జట్టు కోరుకోదు'

"ఎస్జీ బంతుల కంటే కూకబురా లేదా డ్యూక్​ బంతులతో ఆడటమే నయం".. రెండేళ్ల కిందట అశ్విన్​ వ్యక్తం చేసిన అభిప్రాయమిది. బంతిపై సీమ్​ ఎక్కువ ఓవర్లు నిలవడం లేదని, పాతపడ్డాక బంతిని గ్రిప్​ చేయడం కష్టమవుతుందన్నది కొన్నేళ్లుగా అశ్విన్​ చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు కెప్టెన్​ కోహ్లీ కూడా అతడికి జత కలిశాడు. ఎస్జీ బంతుల నాణ్యతపై అతడు అసంతృప్తి వ్యక్తం చేశాడు.

తొలి టెస్టు ముగిశాక కోహ్లీ మాట్లాడుతూ.. "బంతి నాణ్యత సంతృప్తికరంగా లేదు. గతంలో ఇలాగే ఇబ్బందులు ఎదుర్కొన్నాం. 60 ఓవర్లకే బంతి పూర్తిగా దెబ్బతింటోంది. టెస్టుల్లో ఇలాంటి బంతిని ఏ జట్టు కోరుకోదు" అని అన్నాడు. కుట్లు పోయి బంతిపై సీమ్​ మృదువుగా మారడం వల్ల బంతిని మార్చాలని టీమ్ఇండియా బౌలర్లు చేసిన విజ్ఞప్తిని అంపైర్లు నితిన్​ మేనన్​, అనిల్ చౌదరి తిరస్కరించారు.

40 ఓవర్లు ముగిసేసరికి బంతి చీలిపోవడం వింతగా ఉందని అశ్విన్ మ్యాచ్​​ నాల్గో రోజు అనంతరం అన్నాడు. "ఎస్జీ బంతి సీమ్​ దగ్గర చీలిపోవడం నేనెప్పడూ చూడలేదు. తొలి రెండు రోజులు పిచ్​ గట్టిగా ఉండటమే అందుకు కారణం కావొచ్చు. అయితే రెండో ఇన్నింగ్స్​లో 35-40 ఓవర్లకే బంతి అలాంటి స్థితికి చేరుకోవడం వింతగా అనిపిస్తోంది. బంతి అలా కావడానికి అసలు కారణం ఏంటన్నదానికి సిరీస్​లో సమాధానం లభిస్తుంది" అని అశ్విన్​ అన్నాడు.

కూకబురా బంతి తయారీకి యంత్రాలను ఉపయోగిస్తారు. ఎస్జీ బంతిని సీమ్​ను చేతితో కుడతారు. అందుకే సీమ్​ ఉబ్బెత్తుగా ఉంటుంది. ఎక్కువ ఓవర్లు వేసినా సీమ్​ పాడయ్యేది కాదు. కానీ కొన్నేళ్లుగా ఆటగాళ్లు ఎస్జీ బంతులపై విమర్శలు చేస్తున్నారు. 2018లో విమర్శల నేపథ్యంలో.. ఆటగాళ్ల సూచనల మేరకు మార్పులు చేశారు. ఆ తర్వాత 2019లో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్​ సిరీస్​లో మార్పులతో తీసుకొచ్చిన బంతులను ఉపయోగించారు. ప్రస్తుతం అవే బంతులనే ఇంగ్లాండ్​తో సిరీస్​లో వాడుతున్నామని ఎస్జీ సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్​ పారస్ ఆనంద్ అన్నాడు. ​

ఇదీ చదవండి:ఐపీఎల్​ నుంచి వివో పూర్తిగా.. కారణమిదే!

Last Updated : Feb 10, 2021, 7:38 AM IST

ABOUT THE AUTHOR

...view details