ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 3-1 తేడాతో విజయఢంకా మోగించి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరుకున్న కోహ్లీసేన.. ఇక టీ20 సిరీస్‌పై దృష్టిపెట్టింది. అయిదేళ్ల విరామం తర్వాత, ఈ ఏడాది అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ సిరీస్‌తోనే టీమ్ఇండియా సన్నాహం మొదలు కాబోతోంది.
ట్వంటీ20 వరల్డ్‌కప్ కోసం జట్టు కూర్పుపై ఓ అంచనాకు వచ్చేందుకు ఇంగ్లాండ్‌తో సిరీస్ ఉపయోగపడుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐసీసీ ట్వంటీ20 ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ మొదటి స్థానంలోను, భారత్ రెండో స్థానంలోను ఉన్న నేపథ్యంలో ఇరుజట్ల మధ్య పోరు రసవత్తరంగా మారనుంది.
ఓపెనర్లుగా..
ఈ సిరీస్‌లో రోహిత్‌కు జోడీగా ఎవరిని ఓపెనర్‌గా పంపుతారన్నది ఆసక్తికరం. చాలా ఏళ్లు రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన ధావన్.. ఏడాది కిందట ఫామ్‌కోల్పోయి జట్టులో తన స్థానాన్ని ప్రశ్నార్థకం చేసుకున్నాడు. ఈ సమయంలో కేఎల్ రాహుల్ నిలకడగా ఆడి ఓపెనింగ్‌లో స్థిరపడ్డాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో వన్డేలు, టీ20లకు రోహిత్ అందుబాటులో లేకపోవడం వల్ల ధావన్‌కు అవకాశం దక్కింది. ఇప్పుడు రోహిత్ ఆడబోతున్నాడు. రాహుల్‌ను పక్కన పెట్టే పరిస్థితి లేదు. ఒక వేళ ధావన్‌ను తుదిజట్టులో ఆడించాలని ప్రయత్నిస్తే అతన్ని ఓపెనర్‌గా పంపి రాహుల్‌ను నాలుగో స్థానంలో ఆడించే అవకాశం ఉంది. అదే జరిగితే శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌లలో ఒకరికే తుదిజట్టులో చోటు దక్కుతుంది.
హార్దిక్ బౌలింగ్‌కు రెడీ!
ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను బౌలర్ పాత్రలో చూడటం అరుదైపోయింది. 2019లో వెన్ను గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాక అతను చాలా కాలం ఆటకు దూరంగా ఉన్నాడు. పునరాగమనం తర్వాత ఆడిన మ్యాచ్‌లు తక్కువ. నిరుడు ఐపీఎల్లో అతను బౌలింగే చేయలేదు. ఆస్ట్రేలియాతో ఒక్క వన్డేలో మాత్రమే 4 ఓవర్లు వేశాడు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ కోసం హర్దిక్ ముమ్మరంగా సాధన చేశాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించాలని కోరుకుంటున్నాడు.
స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా పంత్?
భారత్ చివరగా ఆడిన వన్డే, టీ20 సిరీస్‌ల్లో రిషబ్‌పంత్‌కు తుది జట్టులో స్థానం లేదు. ఇటీవల ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో పంత్ అదరగొట్టాడు. టీ20ల్లోనూ పంత్‌కు తప్పనిసరిగా తుదిజట్టులో స్థానం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.
టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో కేఎల్ రాహుల్‌ను పరిమిత ఓవర్ల క్రికెట్లో వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్‌గా ఆడించడం ఇటీవల భారత్ మొదలుపెట్టింది. ఇప్పుడు పంత్‌ను స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా అయినా తీసుకోవాల్సిందే అన్న డిమాండ్లు మొదలయ్యాయి. మరి పంత్‌ను వికెట్‌కీపర్‌గానే ఆడిస్తారా? లేక రాహుల్‌కే గ్లోవ్స్అప్పగించి స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా ఆడించి చూస్తారా అన్నది తేలాల్సి ఉంది.
పేస్దళానికి సారథిగా భువీ..!
గాయాలతో గత రెండేళ్లలో చాలా కాలం మైదానానికి దూరంగా ఉన్నాడు పేసర్ భువనేశ్వర్. ఎట్టకేలకు ఫిట్నెస్ సాధించి మళ్లీ జట్టులోకి వచ్చాడు. తుది జట్టులో చోటు కోసం చాలామంది పేసర్లు ఎదురు చూస్తున్న నేపథ్యంలో భువి సత్తా చాటాల్సిందే.