తెలంగాణ

telangana

ETV Bharat / sports

లార్డ్స్​లో ఓ అద్భుతం.. మ్యాచ్​లో అదే మలుపు! - భారత్​ ఇంగ్లాండ్​ టెస్టు

ఒక్కరైనా ఊహించి ఉంటారా కోహ్లీసేన గెలుస్తుందని? ఇంగ్లాండ్‌కు పొరపాటునైనా ఈ ఫలితం వస్తుందన్న ఆలోచన వచ్చి ఉంటుందా? లార్డ్స్‌లో అద్భుతమే జరిగింది. ఆతిథ్య జట్టుకు దిమ్మదిరిగే షాక్‌! కోహ్లీసేన సంచలనం సృష్టించింది. అంచనాలను తలకిందులు చేస్తూ, అదిరే ప్రదర్శనతో రెండో టెస్టులో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. టీమ్‌ఇండియా పోరాటం అద్వితీయం. మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా గొప్పే అనుకున్న స్థితి నుంచి పట్టుదలగా పుంజుకొని, పైచేయి సాధించి.. ధీమాగా ఉన్న ఇంగ్లిష్‌ జట్టుకు షాకిచ్చిన తీరు నభూతో..! సిరాజ్‌, షమి, బుమ్రా.. లార్డ్స్‌లో ఆఖరి రోజు హీరోలు. అనూహ్యంగా బ్యాటుతో మెరిసిన షమి, బుమ్రా జట్టుకు ఓటమి ముప్పును తప్పిస్తే.. సిరాజ్‌ అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లాండ్‌ డ్రా ప్రయత్నాలకు చెక్‌ పెట్టాడు. బుమ్రా, ఇషాంత్‌తో కలిసి భారత్‌ను విజయపథంలో నడిపించాడు.

india england series lords
రెండో టెస్టును మలుపు తిప్పిన భారత బౌలర్లు!

By

Published : Aug 17, 2021, 7:22 AM IST

లార్డ్స్‌లో భారత జట్టు విజయంలో హైదరాబాదీ పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌దే కీలకపాత్ర. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ మరీ ఎక్కువ ఆధిక్యం సాధించకుండా చూసిన ఈ కుర్రాడు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ నాలుగు వికెట్ల ప్రదర్శనతో జట్టును గెలిపించాడు. మ్యాచ్‌ డ్రా దిశగా మళ్లుతున్న స్థితిలో అతడి సంచలన బౌలింగే జట్టుకు విజయాన్నందించింది. మొదట మొయిన్‌ అలీ-బట్లర్‌ పట్టుదలగా ఆడుతూ క్రీజులో పాతుకుపోతున్న సమయంలో వరుస బంతుల్లో మొయిన్‌, కరన్‌లను ఔట్‌ చేసి దెబ్బ కొట్టిన సిరాజ్‌.. మ్యాచ్‌ ముగియడానికి మరి కొన్ని ఓవర్లే ఉన్న సమయంలో ఒకే ఓవర్లో బట్లర్‌, అండర్సన్‌ను పెవిలియన్‌ చేర్చి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు.

ఇన్‌స్వింగింగ్‌ యార్కర్లు, షార్ట్‌ బంతులకు మెరుపు వేగాన్ని జోడించి అతడు ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ను బుట్టలో వేశాడు. సిరాజ్‌ ఇలాంటి ప్రదర్శన చేయడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనలోనూ అతడు మెరుపు బౌలింగ్‌తో కంగారూల పనిపట్టాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి జట్టు సిరీస్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. చివరిదైన నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్ల ప్రదర్శన ఓ సంచలనం.

బుమ్రా, షమి దంచేశారు..

నాలుగో రోజు ఆట ఆఖరుకు ఇంగ్లాండ్‌దే స్పష్టంగా పైచేయి. విజయాన్ని ఆశించే స్థితిలో ఉంది కూడా. రహానె, పుజారా పోరాడినా.. భారత్‌కు ముప్పు పొంచే ఉంది. 181/6తో నిలిచిన ఆ జట్టు ఆధిక్యం 154 పరుగులు మాత్రమే. పంత్‌ తప్ప మిగిలిన వాళ్లంతా టెయిలెండర్లే. అయిదోరోజు ఆ ఆఖరి నాలుగు వికెట్లను చకచకా పడగొట్టి మ్యాచ్‌పై పట్టుబిగించవచ్చని ఇంగ్లాండ్‌ భావించే ఉంటుంది. అందుకు తగ్గట్లే పంత్‌ (22)ను త్వరగా (జట్టు స్కోరు 194 వద్ద) వెనక్కి పంపడం, కాసేపటికే ఇషాంత్‌ కూడా నిష్క్రమించడం వల్ల ఆ జట్టు లక్ష్యం నెరవేరుతుందేమో అనిపించింది. కానీ ఊహించని విధంగా ఇంగ్లాండే ఒత్తిడికి గురైంది.

టెయిలెండర్లు షమి, బుమ్రా ఆ జట్టుకు షాకిచ్చారు. ప్రతికూల పరిస్థితుల్లో మొండి పట్టుదలతో సోమవారం షమి, బుమ్రా చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోయేదే. ప్రత్యర్థి బౌలర్లను తట్టుకుని ఒక్కో పరుగు జత చేస్తూ మ్యాచ్‌ గతినే మార్చేసింది ఈ జోడీ. జట్టు ఆధిక్యం 200 దాటడమే కష్టమనుకున్న దశ నుంచి ప్రత్యర్థి ముందు 272 పరుగుల లక్ష్యం నిలిపే స్థాయికి చేర్చారు. అభేద్యమైన 9వ వికెట్‌కు ఏకంగా 89 పరుగులు జోడించి.. భారత్‌కు ప్రమాదాన్ని తప్పించడమే కాకుండా.. గెలుపు కోసం ప్రయత్నించే అవకాశం కల్పించారు. షమి-బుమ్రా జోడీ మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసింది. ఈ పర్యటనలో షమి-బుమ్రాల భాగస్వామ్యం ఒక గొప్ప మలుపే!

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 364

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 391

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) బట్లర్‌ (బి) వుడ్‌ 21; పుజారా (సి) రూట్‌ (బి) వుడ్‌ 45; కోహ్లి (సి) బట్లర్‌ (బి) కరన్‌ 20; రహానె (సి) బట్లర్‌ (బి) అలీ 61; పంత్‌ (సి) బట్లర్‌ (బి) రాబిన్సన్‌ 22; జడేజా (బి) అలీ 3; ఇషాంత్‌ ఎల్బీ (బి) రాబిన్సన్‌ 16; షమి నాటౌట్‌ 56; బుమ్రా నాటౌట్‌ 34; ఎక్స్‌ట్రాలు 15 మొత్తం: (109.3 ఓవర్లలో 8 వికెట్లకు) 298 డిక్లేర్డ్‌; వికెట్ల పతనం: 1-18, 2-27, 3-55, 4-155, 5-167, 6-175, 7-194, 8-209; బౌలింగ్‌: అండర్సన్‌ 25.3-6-53-0; రాబిన్సన్‌ 17-6-45-2; మార్క్‌ వుడ్‌ 18-4-51-3; సామ్‌ కరన్‌ 18-3-42-1; మొయిన్‌ అలీ 26-1-84-2; రూట్‌ 5-0-9-0

ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: బర్న్స్‌ (సి) సిరాజ్‌ (బి) బుమ్రా 0; సిబ్లీ (సి) పంత్‌ (బి) షమి 0; హమీద్‌ ఎల్బీ (బి) ఇషాంత్‌ 9; రూట్‌ (సి) కోహ్లి (బి) బుమ్రా 33; బెయిర్‌స్టో ఎల్బీ (బి) ఇషాంత్‌ 2; బట్లర్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 25; అలీ (సి) కోహ్లి (బి) సిరాజ్‌ 13; కరన్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 0; రాబిన్సన్‌ ఎల్బీ (బి) బుమ్రా 9; వుడ్‌ నాటౌట్‌ 0; అండర్సన్‌ (బి) సిరాజ్‌ 0; ఎక్స్‌ట్రాలు 29 మొత్తం: (51.5 ఓవర్లలో ఆలౌట్‌) 120; వికెట్ల పతనం: 1-1, 2-1, 3-44, 4-67, 5-67, 6-90, 7-90, 8-120, 9-120; బౌలింగ్‌: బుమ్రా 15-3-33-3; షమి 10-5-13-1; జడేజా 6-3-5-0; సిరాజ్‌ 10.5-3-32-4; ఇషాంత్‌ 10-3-13-2

ఇవీ చూడండి :

ABOUT THE AUTHOR

...view details