అహ్మదాబాద్ వేదికగా గురువారం నుంచి జరగనున్న సిరీస్ నిర్ణయాత్మక టెస్టుకు భారత్-ఇంగ్లాండ్ జట్లు సమాయత్తమయ్యాయి. సిరీస్ ఫలితాన్ని తేల్చే మ్యాచ్ కావడం వల్ల ఇరుజట్లు తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. రెండు, మూడో టెస్టుల్లో విజయాలు సాధించిన భారత్.. మరోసారి అలాంటి ఫలితాన్నే పునారవృతం చేయాలని భావిస్తోంది. సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్నా.. టీమ్ఇండియాను బ్యాటింగ్ ఇంకా కలవరపెడుతోంది.
ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా స్పిన్నర్ అశ్విన్ నిలవడం.. భారత బ్యాటింగ్ వైఫల్యాన్ని చాటుతోంది. కష్టతరమైన చెపాక్ పిచ్‌పై అశ్విన్ శతకంతో రాణించినా.. మిగిలిన ఆటగాళ్లు విఫలమయ్యారు. స్పిన్ పిచ్‌లపై భారత బ్యాట్స్‌మెన్ విఫలం కావడం మేనేజ్‌మెంట్‌ను ఆందోళన కలిగిస్తోంది.
కెప్టెన్ కోహ్లీ రెండు అర్ధ శతకాలతో రాణించినా.. వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యాడు. రహానె, పుజారా, గిల్, రిషబ్ పంత్ నుంచి అభిమానులు భారీ స్కోర్లు ఆశిస్తున్నారు. బ్యాటింగ్‌లో టాపార్డర్ సత్తా చాటితే టీమ్ఇండియా విజయం ఖాయమని మాజీలు అంచనా వేస్తున్నారు.
మరోసారి స్పిన్ పిచ్?
మొతేరాలో మరోసారి స్పిన్ పిచ్‌నే సిద్ధం చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో.. టీమ్ఇండియా స్పిన్నర్లు సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. మూడో టెస్టును రెండు రోజుల్లోనే ముగించిన స్పిన్నర్లు.. మరోసారి అలాంటి ప్రదర్శనే చేయాలని కోహ్లీసేన భావిస్తోంది. మొదటి మూడు టెస్టుల్లో 60 ఇంగ్లాండ్ వికెట్లలో 49 స్పిన్నర్లే తీశారు.
టీమ్ఇండియా స్పిన్నర్లు అక్షర్ పటేల్, అశ్విన్ స్పిన్ మాయాజాలం కొనసాగితే రూట్ సేనకు తిప్పలు తప్పవు. నాలుగో టెస్టుకు బుమ్రా అందుబాటులో లేకపోవడం వల్ల అతని స్థానంలో ఉమేశ్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. స్పిన్ పిచ్‌పై ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగాలని టీమ్ఇండియా భావిస్తే వాషింగ్టన్ సుందర్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి రావచ్చు.
ఇంగ్లాండ్ గాడిన పడుతుందా?