ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో టీమ్ ఇండియా పటిష్ఠ స్థితిలో నిలిచింది. తొలి రోజు మొత్తం మనదే ఆధిపత్యం. ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్లు నష్టానికి 276 పరుగులు చేసింది.
రోజంతా బౌలింగ్ చేసిన ఇంగ్లాండ్ 3 వికెట్లు మాత్రమే తీయగలిగింది. ఆతిథ్య జట్టులో అండర్సన్ రెండు వికెట్లు తీశాడు. ఓలీ రాబిన్‌సన్ ఒక వికెట్ తీశాడు.
రాహుల్ సెంచరీ, రోహిత్ అర్ధసెంచరీ..
ఇన్నింగ్స్ మొత్తంలో ఓపెనర్లు రాహుల్, రోహిత్ ఆటే హైలెట్. ఇద్దరూ కలిసి ఇంగ్లాండ్ బౌలర్లకు పరీక్ష పెట్టారు. తొలి వికెట్‌కు 126 పరుగులు జోడించారు.
కేఎల్ రాహుల్ టెస్టుల్లో ఆరో సెంచరీ చేశాడు. రోహిత్ 13వ అర్ధసెంచరీ చేశాడు.
మెల్లగా మొదలై..
అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్.. కోహ్లీ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. వర్షం కారణంగా టాస్కు 15 నిమిషాలు ఆలస్యమైంది. తొలుత ఆచితూచి ఆడింది భారత జోడీ. 9 ఓవర్లకు జట్టు స్కోరు 8/0. ఆ తర్వాత రోహిత్ ఎడాపెడా బౌండరీలు బాదగా.. రాహుల్ డిఫెన్స్‌తో ఆకట్టుకున్నాడు.
అనంతరం.. 19వ ఓవర్లో మరోసారి వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో లంచ్ బ్రేక్ ప్రకటించారు. అప్పటికి భారత్ స్కోరు 46/0.
రోహిత్ దూకుడుతో.. ఈ క్రమంలోనే టెస్టుల్లో 13వ అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాతా వేగం పెంచిన రోహిత్(83).. ఇన్నింగ్స్ 44వ ఓవర్లో అండర్సన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. 126 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.