చెపాక్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 83.2 ఓవర్లకు 276 పరుగులు చేసి ఆలౌటైంది. మొత్తంగా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో పాటు అశ్విన్(106) సెంచరీ, కోహ్లీ(62) హాఫ్ సెంచరీ తోడవ్వడం వల్ల ఇంగ్లీష్ జట్టు ముందు 482 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
ఆట సాగిందిలా
ఓవర్‌నైట్ స్కోరు 54/1తో మూడో రోజు ఆటను కొనసాగించిన టీమ్ఇండియా మరో 232 పరుగులు చేసింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై తొలుత పరుగులు చేయడానికి భారత బ్యాట్స్‌మెన్స్ ఇబ్బంది పడ్డారు. ఆదిలోనే ఒకే ఓవర్లో వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది టీమ్ఇండియా. చెతేశ్వర్ పుజారా 55 పరుగుల వద్ద రెండో విక్ట్గా రనౌటయ్యాడు. ఆ వెంటనే లీచ్ బౌలింగ్‌లో అదే స్కోరు వద్ద రోహిత్ మూడో వికెట్‌గా స్టంపౌటయ్యాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ఈ సారి ముందుగానే వచ్చిన పంత్.. ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి లీచ్ బౌలింగ్‌లోనే స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.
తర్వాత క్రీజులోకి వచ్చిన ఆజింక్య రహానె.. కెప్టెన్ విరాట్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు యత్నించాడు. ఈ జోడీ 31 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను మొయిన్ అలీ దెబ్బకొట్టాడు. అక్షర్ పటేల్ కూడా అలీ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరకిపోయాడు.