రెండున్నర గంటలు బ్యాటింగ్ చేసి క్రీజ్‌లో నిలదొక్కుకున్న తర్వాత ఔటవ్వడం చిరాకు పెట్టిందని ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ అన్నాడు. మూడో టెస్టుకన్నా మెరుగైన పిచ్‌పై భారీ స్కోరు చేయలేకపోవడం నిరాశ పరిచిందని పేర్కొన్నాడు.
మరోవైపు టీమ్‌ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన బౌలరని ప్రశంసించాడు. భారత్‌లో ఎక్కువగా అతడే బౌలింగ్ చేస్తాడు కాబట్టి తన వికెట్ అతడికి దక్కడంలో ఆశ్చర్యమేమీ లేదని అభిప్రాయపడ్డాడు. నాలుగో టెస్టు తొలిరోజు ఆట ముగిశాక మీడియాతో బెన్‌స్టోక్స్ ఈ విధంగా మాట్లాడాడు.
"క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత ఔటవ్వడం నిరాశపరిచింది. అర్ధశతకం సాధించడం పెద్ద స్కోరేమీ కాదు. దాంతో టెస్టు మ్యాచ్‌లు గెలవలేం. ఇలాంటి వికెట్‌పై ఔటవ్వడం చిరాకుగా అనిపించింది. రెండున్నర గంటలు బంతిని డిఫెండ్ చేసి సౌకర్యంగా అనిపించిన తర్వాత టర్న్ అవ్వని బంతికి వికెట్ ఇచ్చేశాను. అంతకుముందు వరకు నేరుగా వచ్చే బంతికి వికెట్ ఇవ్వొద్దని బలంగా కోరుకున్నాను. అందుకే నాపై నాకే చిరాకుగా అనిపించింది. మేం మరిన్ని పరుగులు చేయాల్సింది. ఏదేమైనా ఆట ఆఖర్లో ఇంగ్లాండ్‌కు గిల్ వికెట్ దక్కడం బాగుంది. నేనిప్పటి వరకు దాదాపుగా 70 మ్యాచులు ఆడుంటాను. ఒక బ్యాట్స్‌మన్‌గా నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన పరిస్థితులు ఇవేనని జట్టులో మిగతా వాళ్లకు చెప్పాను. ఒక్కో బ్యాట్స్‌మన్‌కు ఒక్కో పాత్ర ఉంటుంది. మళ్లీ ఇక్కడికొచ్చినప్పుడు మరింత మెరుగై రావాలి."