మూడో టెస్టులో టీమ్ఇండియా బౌలర్లు అత్యంత క్రమశిక్షణతో బౌలింగ్ చేశారని ఇంగ్లాండ్ ఆటగాడు డేవిడ్ మలన్ అంటున్నాడు. కట్టుదిట్టమైన బంతులతో వారు తమకెన్నో ప్రశ్నలు సంధించారని పేర్కొన్నాడు. కానీ పిచ్ నుంచి వారికి సరైన సహకారం అందలేదని వెల్లడించాడు.
"టీమ్‌ఇండియా బౌలర్లు పేలవంగా బౌలింగ్ చేశారని చెప్పలేను. ఎందుకంటే వారెంతో క్రమశిక్షణగా బంతులు విసిరారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మమ్మల్ని ప్రశ్నించారు. బహుశా వారికి పిచ్ నుంచి పూర్తి సహకారం లభించలేదు."
- డేవిడ్ మలన్, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్
ఈ మూడేళ్లలో మలన్ ఆడిన తొలి టెస్టు ఇదే కావడం గమనార్హం. సాధారణంగా దూకుడుగా ఆడే అతడు తొలి ఇన్నింగ్స్‌లో 70 పరుగులు చేశాడు. కెప్టెన్ జో రూట్‌తో కలిసి మూడో వికెట్‌కు 139 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దాంతో ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 423 పరుగులు చేసింది. రూట్ సిరీసులో వరుసగా మూడో శతకం బాదేశాడు.
అదే విధంగా తమ కెప్టెన్ జోరూట్‌పై మలన్ ప్రశంసల జల్లు కురిపించాడు. "అతనెప్పుడూ పరుగులు చేస్తూనే ఉంటాడు. కానీ అతడు సులభంగా, వేగంగా పరుగులు చేయడం ఎంతో బాగుంది. ఈ సిరీస్‌లో మరోసారి జట్టును ముందుండి నడిపించాడు. పూర్తి ఘనత అంతా అతడికే దక్కుతుంది. అతడి ఫుట్ మూమెంట్ అద్భుతంగా ఉంటుంది. బంతి పొజిషన్ గుర్తించి చక్కగా ఆడతాడు. చాలామంది కన్నా బంతిని ఆలస్యంగా ఆడతాడు. అందుకే అతడికి ఏదైనా చెత్త బంతి దొరికిందంటే శిక్షించేస్తాడు. మరో ఎండ్ నుంచి అతడి బ్యాటింగ్ చూడటం ముచ్చటేస్తుంది" అని మలన్ అన్నాడు.
ఇదీ చూడండి..సిరాజ్ బౌలింగ్‌కు ఫిదా అయిన పాకిస్థానీ అభిమాని