ఇంగ్లాండ్-ఇండియా మధ్య సుదీర్ఘ టెస్టు సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ముగిసిన తర్వాత జరగబోతున్న తొలి సిరీస్ ఇది. ఈ సిరీస్‌లో గెలిచి టీమ్ఇండియా డబ్ల్యూటీసీ-2లో శుభారంభం చేస్తుందా? లేక ఇంగ్లాండ్ గడ్డపై తేలిపోతుందా? అనేది చూడాల్సి ఉంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ బుధవారం(ఆగస్టు 4) మధ్యాహ్నం 3.30కు ప్రారంభమవుతుంది.
జట్టు ఎంపిక ఎలా..
సౌథాంప్టన్ వేదికగా కివీస్‌తో ఇటీవల జరిగిన తొలి డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమ్ఇండియా ఘోర పరాభవం చవిచూసింది. మ్యాచ్‌కు రెండ్రోజుల ముందే జట్టును ప్రకటించిన భారత కెప్టెన్ కోహ్లీ.. తుదిజట్టులో ఇద్దరు స్పిన్నర్లకు అవకాశమిచ్చాడు. కానీ, అక్కడి వాతవరణం పేసర్లకు అనుకూలించింది. మ్యాచ్‌కు ముందు మరోసారి తుదిజట్టులో మార్పులు చేసే వీలున్నప్పటికీ విరాట్ ఆ పని చేయలేదు. న్యూజిలాండ్ నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగి అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ఎలాంటి జట్టును బరిలోకి దించుతుందనేది భారత అభిమానులు ఎదురుచూసే అంశం.
రోహిత్‌కు జోడీ అతడేనా?
రోహిత్‌కు జతగా కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. కౌంటీ సెలెక్ట్ ఎలెవన్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో సెంచరీ చేయడం రాహుల్‌కు కలిసొచ్చే అంశం. ఇటీవలి కాలంలో టెస్టుల్లో భారత్‌కు ఓపెనర్‌గా ఉన్న.. శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా సిరీస్‌కు దూరమవ్వగా, ప్రాక్టీస్‌లో గాయంతో మయాంక్ అగర్వాల్ తొలి టెస్టుకు దూరమయ్యాడు.
ఇదీ చదవండి:బీసీసీఐ, పీసీబీ మధ్య 'కేపీఎల్' రగడ!
వీరు రాణిస్తే..
భారత ఇన్నింగ్స్‌కు నయావాల్లా పేరుగాంచిన పుజారా.. ఇటీవల కాలంలో పెద్దగా రాణించట్లేదు. ఒక మంచి ఇన్నింగ్స్‌తో మళ్లీ ఫామ్‌ను అందిపుచ్చుకోగల సత్తా అతని సొంతం. కానీ, అతని వైఫల్యం జట్టును కలవరపెడుతోంది. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ అజింక్య రహానె బ్యాటింగ్‌లో తడబడుతున్నారు. వీరిద్దరిలో ఒక్కరైనా రాణించాల్సిన అవసరం ఉంది. వీరితో పాటు హనుమ విహారి మిడిలార్డర్లో కీలకం కానున్నాడు.
ధనాధన్ ఇన్నింగ్స్‌లకు మారుపేరైన రిషభ్ పంత్.. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఉసూరుమనిపించాడు. రెండో ఇన్నింగ్స్‌లో కాస్త పోరాడినా.. అప్పటికే మ్యాచ్ చేజారింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో సత్తాచాటిన పంత్.. అదే ఫామ్‌ను కొనసాగించలేకపోయాడు. టెయిలెండర్ల సహకారంతో అతడు రాణిస్తే జట్టుకు మరిన్ని పరుగులు వస్తాయి. ఇంగ్లాండ్ పరిస్థితుల దృష్ట్యా అశ్విన్, జడేజా ఇద్దరికీ చోటు దక్కే అవకాశం లేదు. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, షమి, ఇషాంత్ శర్మను తుది జట్టులో ఆడించే వీలుంది. కివీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్లో షమి, ఇషాంత్ ఫర్వాలేదనిపించినప్పటికీ.. బుమ్రా పూర్తిగా తేలిపోయాడు.
లంక పర్యటనలో ఉన్న సమయంలో పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌కు.. ఇంగ్లాండ్‌తో సిరీస్ కోసం ఆలస్యంగా పిలుపొచ్చింది. వారి సేవలను ఏమైనా వినియోగించుకుంటుందా అనేది వేచిచూడాలి.
ఇంగ్లాండ్‌కు సానుకూలత..
సొంతగడ్డపై ఆడనుండటం ఇంగ్లాండ్‌కు అతిపెద్ద సానుకూలత. గత భారత పర్యటనలో ఓటమికి బదులుతీర్చుకోవాలని రూట్ సేన భావిస్తోంది. దీంతో పాటు డబ్ల్యూటీసీ-2లో శుభారంభం చేయాలని యోచిస్తోంది. పేస్‌కు అనుకూలించే ఇంగ్లిష్ పిచ్‌లపై జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, ఒల్లీ రాబిన్సన్, మార్క్ వుడ్, సామ్ కరన్ వంటి బౌలర్లను ఎదుర్కోవడం భారత బ్యాట్స్‌మెన్‌కు సవాలనే చెప్పాలి. జోఫ్రా ఆర్చర్ ఆడేది అనుమానంగా మారింది.
దీంతో పాటు బ్యాటింగ్‌లో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడగల కెప్టెన్ రూట్‌తో పాటు బెయిర్ స్టో, జాక్ క్రాలీ, ఒల్లీ పోప్ ఆ జట్టుకు అదనపు బలం. తనదైన రోజున రోరీ బర్న్స్, జోస్ బట్లర్ భారీ ఇన్నింగ్స్‌లు ఆడగల సత్తా ఉన్నవారే. బెన్ స్టోక్స్ వంటి ఆల్‌రౌండర్ లేకపోవడం ఇంగ్లాండ్‌కు అతిపెద్ద లోటు. ఇటీవలే.. అతడు క్రికెట్‌కు కాస్త విరామం ప్రకటించాడు.
ఇదీ చదవండి:ఆ దేశ క్రికెటర్ల రాకతో మరింత సందడిగా ఐపీఎల్