ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 227 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది భారత్. దీంతో జట్టులో పలు మార్పులు చేయాలని భావిస్తోంది యాజమాన్యం. గాయం కారణంగా ఇప్పటికే సిరీస్ మొత్తానికి ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దూరమయ్యాడు. దీంతో నాలుగు, ఐదో బౌలర్లుగా ఎవరిని తీసుకోవాలన్నది మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది.
చెన్నై పిచ్ పొడిగా, మందకొడిగా ఉంది. దీంతో నలుగురు స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకోవాలనే యోచనలో ఉంది ఇండియా. లెఫ్టార్మ్ స్పిన్నర్ నదీమ్, సుందర్‌లకు తొలి టెస్టులో స్థానం కల్పించినప్పటికీ పేలవ ప్రదర్శన చేశారు. బౌలింగ్‌లో విఫలమైనప్పటికీ బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సుందర్‌ను ఆల్‌రౌండర్ జాబితాలో తీసుకునే అవకాశం ఉంది. నదీమ్‌కు మాత్రం తర్వాతి టెస్టుకు ఉద్వాసన పలకడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.
అక్షర్‌ను తీసుకుంటారా?
బీసీసీఐ బుధవారం అక్షర్ పటేల్ బౌలింగ్ వీడియోను ఒకదానిని విడుదల చేసింది. జడేజా స్థానంలో జట్టులోకి రావాల్సిన అక్షర్.. మోకాలి గాయం కారణంగా మొదటి టెస్టుకు దూరమయ్యాడు. ఇతడు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగలడు. ఒకవేళ ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ టీమ్‌లో చేరితే బౌలింగ్‌లో కొంత వైవిధ్యం కనిపిస్తుంది.
మొదటి రెండు టెస్టులకు జట్టులో ఉన్న కుల్దీప్ యాదవ్ స్థానంలో నదీమ్‌కు చోటు కల్పించడంపై కెప్టెన్ కోహ్లీ స్పందించాడు. రైట్ హాండ్ బ్యాట్స్మెన్లకు నదీమ్ బౌలింగ్ చేసేటప్పుడు అశ్విన్, సుందర్‌లను తలపిస్తాడని విరాట్ పేర్కొన్నాడు. అదే జరిగితే ప్రస్తుత సిరీస్‌లో ఈ మణికట్టు బౌలర్‌కు చోటు దక్కడం కష్టమే.