Alex Hales Retirement : ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ అలెక్స్ హేల్స్ తన అభిమానులకు షాకింగ్ న్యూస్ ఇచ్చాడు. 32 ఏళ్ల ఈ విధ్యంసకర బ్యాటర్ తన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని అతడు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించాడు.
"నా దేశం తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 156 మ్యాచులు ఆడే అవకాశం రావడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఇంగ్లాండ్ తరఫున నేను కొన్ని మధురమైన అనుభవాలతో పాటు కొందరు ఆత్మీయ స్నేహితులను సొంతం చేసుకున్నాను. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని అనుకుంటున్నాను. ఇంగ్లాండ్ జెర్సీ వేసుకున్న ప్రతిసారి నేను గర్వంతో ఉప్పొంగిపోయాను, ఓటమి ఎదురైనప్పుడల్లా బాధతో కుంగిపోయాను. ఈ ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది. ఇంగ్లాండ్ తరఫున నేను ఆడిన ఆఖరి మ్యాచ్, వరల్డ్ కప్ విన్నింగ్ ఫైనల్ కావడం నాకు చాలా గర్వంగా ఉంది" అంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నాడు. టీ20 కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో అతడు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Alex Hales in T20 World Cup : కాగా 2022లో జరిగిన టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో విధ్యంసకర బ్యాటింగ్ చేసిన హేల్స్.. ఇంగ్లాండ్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. హోరా హోరీగా జరిగిన ఈ టోర్నీలో ఆడిన 6 మ్యాచ్‌ల్లో 2 అర్థ సెంచరీల సాయంతో 212 పరుగులు చేశాడు. అయితే పాకిస్థాన్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో హేల్స్ (1) విఫలమైనప్పటికీ అంతకుముందు జరిగిన మ్యాచుల్లో భారీ స్కోర్ నమోదు చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతడికి ఆఖరి మ్యాచ్ ఇదే కావడం విశేషం. అంతకుముందు భారత్‌తో జరిగిన సెమీఫైనల్స్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 47 బంతుల్లో 86 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ (52), శ్రీలంక (47)తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌ల్లోనూ హేల్స్ చెలరేగిపోయాడు.
Alex Hales Career : 2011లో ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్‌లోకి చేరిన హేల్స్ తన అరంగేట్ర టీ20 మ్యాచ్‌ను భారత్‌తో ఆడాడు. 2014లో వన్డేల్లోకి, 2015లో టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అలా తన 12 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో 11 టెస్టులు, 70 వన్డేలు, 75 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. ఈ క్రమంలో మూడు ఫార్మాట్లలో వరుసగా 573, 2419, 2074 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ తరఫున అన్ని విభాగాల్లో కలిపి 5000కు పైగా పరుగులు చేశాడు. అందులో ఏడు సెంచరీలతో పాటు 31 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం.
ఇక పాకిస్థాన్ సూపర్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, బిగ్ బాష్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, సౌతాఫ్రికా20, ఇంటర్నేషనల్ లీగ్ టీ20 వంటి టోర్నీల్లో అలెక్స్ హేల్స్‌కు మంచి రికార్డు ఉంది. అయితే ఐపీఎల్‌లో మాత్రం అతనికి చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు.