లార్డ్స్ టెస్టు మూడో రోజు దాదాపు ఆధిపత్యం మొత్తం ఇంగ్లాండ్దనే చెప్పాలి. ఆతిథ్య జట్టును ఆలౌట్ చేశామన్న సంతృప్తి తప్పితే మిగిలిందేమి లేదు. రూట్ భారీ సెంచరీతో(180; 321 బంతుల్లో) భారత తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని దాటివేసింది ఇంగ్లాండ్.
119/3తో మూడో రోజు ఆట మొదలు పెట్టిన ఇంగ్లాండ్ తొలి సెషన్లో 97 పరుగులు జోడించింది. వికెట్ కోల్పోకుండా భారత బౌలర్లకు చిరాకు తెప్పించారు రూట్- బెయిర్ స్టో ద్వయం. ఈ క్రమంలోనే వీరిద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ టీమ్ఇండియా సహనాన్ని పరీక్షించారు. నాలుగో వికెట్‌కు 121 పరుగులు నమోదు చేసి తమ జట్టును భారీ స్కోరు దిశగా నడిపించారు. 216/3తో లంచ్ విరామానికి వెళ్లింది ఇంగ్లాండ్.
అనంతరం కాసేపటికే బెయిర్ స్టో వికెట్‌ను కోల్పోయింది ఆతిథ్య జట్టు. సిరాజ్ ఈ జోడీని విడగొట్టి మూడో రోజు తొలి వికెట్‌ను అందించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జోస్ బట్లర్ కూడా రూట్‌కు సహకరించాడు. ఐదో వికెట్‌కు 54 పరుగులు జోడించింది రూట్- బట్లర్ జంట. ఈ జోడీని ఇషాంత్ విడగొట్టాడు. తర్వాత వచ్చిన మొయిన్ అలీ కూడా ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్‌కు సహకరిస్తూనే చెత్త బంతుల్ని బౌండరీకి తరలించాడు. ఆరో వికెట్‌కు వీరిద్దరూ 58 రన్స్ అందించారు.