ఇటీవల ఐపీఎల్ మినీ వేలంలో భారీ ధరను సొంతం చేసుకొని రికార్డు సృష్టించిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ శామ్ కరన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిర్వాకంతో కరన్‌కు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ప్రయాణించడానికి శామ్ కరన్ టికెట్ బుక్ చేసుకొన్నాడు. కానీ, ప్రయాణానికి ముందు.. కేటాయించిన సీట్ విరిగిపోయిందనే కారణంతో తనను విమానం ఎక్కేందుకు సిబ్బంది అనుమతించలేదని ట్వీట్ చేశాడు.
"వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించేందుకు సిద్ధమవుతుండగా .. నాకు కేటాయించిన సీటు విరిగిపోయిందని సిబ్బంది చెప్పారు. అందులో మీరు ప్రయాణించడం కుదరదు అని తెలిపారు. ఇదంతా పిచ్చితనంగా అనిపించింది. ధన్యవాదాలు వర్జిన్ అట్లాంటిక్. ఇలాంటి సంఘటనతో నేను దిగ్భ్రాంతికి గురి కావడంతోపాటు.. తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది" అని కరన్ ట్వీట్ చేశాడు. అయితే శామ్ ఎక్కడికి ప్రయాణిస్తున్నాడో మాత్రం తెలియజేయలేదు.
శామ్ కరన్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన వర్జిన్ అట్లాంటిక్ శామ్ ట్వీట్‌కు వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌లైన్స్ స్పందించింది. "హాయ్ శామ్. ఇలా జరగడం బాధాకరం. దానికి క్షమాపణలు చెబుతున్నాం. ఒకవేళ మీరు ఆ విషయాన్ని మా హెల్ప్ డెస్క్ దృష్టికి తీసుకొచ్చి ఉంటే.. వారు సంతోషంగా మరో విమానంలో సీటు కేటాయించేవారు. మీ ఫీడ్‌బ్యాక్‌ను మా కస్టమర్ కేర్ టీమ్‌కూ పంపొచ్చు" అని రిప్లై ఇచ్చింది. అయితే, కరన్‌కు జరిగిన సంఘటనకు సోషల్ మీడియాలో అభిమానులు మద్దతుగా నిలిచారు. గతంలో మాకూ ఇలాంటి అనుభవం ఎదురైందని, ఆ సంస్థ మేనేజ్‌మెంట్ సరిగా స్పందించడం లేదని కామెంట్లు చేశారు.
గత టీ20 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లాండ్ కప్ గెలవడంలో శామ్ కరన్ కీలక పాత్ర పోషించాడు. దీంతో ఐపీఎల్ మినీ వేలంలో హాట్ కేక్‌లా అమ్ముడైపోయాడు. అతడి కోసం ముంబయి, బెంగళూరు, లఖ్‌నవూ, చెన్నై, రాజస్థాన్, పంజాబ్ తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి అత్యధికంగా రూ.18.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకొంది. అప్పటి వరకు దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ (రూ. 16.25 కోట్లు) పేరిట ఉన్న రికార్డును శామ్ అధిగమించాడు.