ENG Vs SL World Cup 2023 :వన్డే ప్రపంచకప్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచుల్లో ఇంగ్లాండ్ జట్టు పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. 2019లో ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు.. ఈ ఏడాది మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేకపోతోంది. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ 8 వికెట్ల తేడాతో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత టాస్ ఎంచుకున్నప్పటికీ.. ఇంగ్లాండ్ జట్టు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయింది. దీంతో 156 పరుగులకే ఆలౌటైంది. ఈ విషయంపై క్రికెట్ లవర్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లాండ్‌కి ఎదురైన ఈ ఓటమికి అసలు కారణాలేంటంటే..
- తాజాగా నమదైన ఓటమితో సెమీఫైనల్ చేరుకునే ఛాన్స్‌ను ఇంగ్లాండ్ జట్టు కోల్పోయేలా కనిపిస్తోంది. జోస్ బట్లర్ పేలవమైన కెప్టెన్సీ కూడా జట్టు ఓటమికి ప్రధాన కారణమని విశ్లేషకులు అంటున్నారు. ప్లేయింగ్ ఎలెవన్‌లో బట్లర్ ఎప్పుడూ మార్పులు చేస్తూనే ఉంటాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ కోసం కూడా మూడు మార్పులు చేశాడు. దీంతో జట్టు ఎప్పుడూ బ్యాలెన్స్‌గా కనిపించలేదు.
- ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు. కానీ మొదటి వికెట్ పడ్డాక.. జట్టు క్రమక్రమంగా డీలాపడటం మొదలెట్టింది. టాప్ ఆర్డర్‌లో ఉన్న ఏ బ్యాట్స్‌మెన్ కూడా క్రీజులో ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న శ్రీలంక బౌలర్లు.. 156 పరుగులకే ఇంగ్లాండ్ జట్టును ఆలౌట్ చేశారు.
- గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన బెన్ స్టోక్స్ మిడిల్ ఆర్డర్‌లోకి వచ్చి జట్టుకు ఆశలు కల్పించాడు. కానీ అతను కూడా ఏ మాత్రం ఆడలేకపోయాడు.
- ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ స్పిన్ బౌలర్లు అంతగా రాణించలేకపోయారు. శ్రీలంక స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇలాంటి సమయంలో ఇంగ్లీష్ జట్టు స్పిన్నర్లు వికెట్లు పడగొట్టుంటే మ్యాచ్ మరోలా ఉండేది.
- శ్రీలంకకు తొలి దెబ్బ ఇచ్చి మ్యాచ్‌ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లు ప్రయత్నించారు. కానీ క్రీజులోకి దిగిన పాతుమ్ నిస్సంకా, సదీర సమరవిక్రమ జోడీని బౌలర్లు పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు. దీంతో జట్టు ఓటమి ఖాయమైంది.