Eng Vs Pak Test : ఇంగ్లాండ్ సాధించింది! పరుగులు వరదలా పారిన జీవం లేని రావల్పిండి పిచ్‌పై ఫలితాన్ని రాబట్టి ఔరా అనిపించింది. పాకిస్థాన్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ధాటిగా ఆడి త్వరగా డిక్లేర్ చేసి సాహసం చేసిన ఇంగ్లిష్ జట్టు.. సోమవారం బంతితో ప్రత్యర్థిని చుట్టేసి 74 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. అండర్సన్ (4/36), రాబిన్సన్ (4/50) గెలుపులో కీలకమయ్యారు. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
343 పరుగుల ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 80/2తో ఆఖరి రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన పాక్ 268కే ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఇమాముల్ హక్ (48) త్వరగా ఔటైనా.. ఓవర్‌నైట్ బ్యాటర్ షకీల్ (76) పోరాడాడు. అతడికి తోడు అజహర్ అలీ (40), రిజ్వాన్ (46) నిలవడంతో ఒక దశలో పాక్ 176/3తో మెరుగ్గానే కనిపించింది. అయితే తక్కువ వ్యవధిలో రిజ్వాన్, షకీల్, అజహర్ ఔట్ కావడంతో పాక్ పోరాటానికి తెరపడింది.