IPL 2023 CSK Jadeja: చెన్నై జట్టు యాజమాన్యంతో విభేదాల కారణంగా రవీంద్ర జడేజా ఇక ఆ జట్టులో ఉండటం కష్టమే అని అందరూ అనుకున్నారు. అయితే.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ జట్టు ఈ ఆల్‌రౌండర్‌ని అట్టిపెట్టుకుంది. గత సీజన్ మొదట్లో జడేజాకు సారథ్య బాధ్యతలను అప్పగించింది యాజమాన్యం. కానీ, వరుస పరాజయాల నేపథ్యంలో.. అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో జడేజాను తొలగించి తిరిగి ధోనీకే కెప్టెన్ బాధ్యతలను అప్పగించారు. అయినప్పటికీ జట్టు భవితవ్యం ఏ మాత్రం మారలేదు. పేలవ ప్రదర్శనతో ఆ జట్టు నాకౌట్ దశకు చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. గాయం కారణంగా జడేజా గత సీజన్‌ను పూర్తిగా ఆడలేదు.
ఈ నేపథ్యంలో జడేజాను జట్టులో కొనసాగించడంపై అనుమానాలు రేకెత్తాయి. ఆ తర్వాత జడ్డూ కూడా తన సోషల్‌మీడియా ఖాతాలో చెన్నై జట్టుతో ఉన్న ఫొటోలను తొలగించడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిచ్చింది. అయితే వీటికి తెరదించుతూ యాజమాన్యం తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో జడేజాను చేర్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ పంచుకుంటూ.. 'మాతో ఉండటం ఎనిమిదో వండర్' అంటూ జడేజా ఫొటోను పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది. ఇక జట్టు సాధించిన ఎన్నో అద్భుత విజయాల్లో భాగమైన ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావోను చెన్నై వదులుకుంది.
ఫ్రాంఛైజీలు తమ ఆటగాళ్లను కొనసాగించే, వదిలేసే తుది జాబితాను ఇచ్చేందుకు గడువు మంగళవారంతో ముగిసింది. కొనసాగించనున్న ఆటగాళ్ల వివరాలను అన్ని ఫ్రాంఛైజీలు వెల్లడించాయి. టీ20 లీగ్ మినీ వేలం డిసెంబరు 23న కోచిలో జరగనుంది.