వన్డే క్రికెట్ వైభవం కనుమరుగు కానుందనే చర్చ ఊపందుకుంది. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ కఠినంగా ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు ఇప్పటికే పలువురు మాజీలు పేర్కొన్నారు. మరోవైపు టీ20 లీగ్‌లు పెరుగుతుండటం కూడా వన్డేల భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపినట్లు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి అభిప్రాయాన్నే ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కూడా వెల్లడించాడు. టీ20 క్రికెట్ లీగ్‌లు ఎక్కువైపోవడంతోనే వన్డేలు మూలకు చేరే పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపాడు.
'టీ20 ప్రభావం.. మరణం అంచున వన్డే క్రికెట్' - ODI cricket is witnessing a slow death
వన్డే క్రికెట్ మనుగడపై ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 లీగ్‌లు పెరుగుతుండటం.. వన్డేల భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు వెల్లడించారు.
‘‘వన్డే ఫార్మాట్ నెమ్మదిగా మరణం అంచుకు చేరుతోందనేది నా అభిప్రాయం. అయితే ఇప్పటికీ వన్డే ప్రపంచకప్ పోటీలు ప్రతి ఒక్కరినీ సంతోషపెడుతున్నాయి. కానీ ఓ ఆటగాడిగా నేను కూడా వరల్డ్ కప్ టోర్నీలో తప్పితే మిగతా వేళ చూసేందుకు గానీ, ఆడేందుకు గానీ ఆసక్తి చూపను. టీ20 ప్రపంచకప్ ముందున్న సమయంలో వన్డేలు ముఖ్యం కాదు. ఇదే క్రమంలో మూడు ఫార్మాట్‌లను ఆడటం తేలికైన విషయం కాదు. ఓ ప్లేయర్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడాలంటే ప్రయాణిస్తూనే ఉండాలి. కుటుంబంతో గడపడం కష్టమే. అందుకే వీటిల్లో ఏది ఆడాలనేదానిపై నిర్ణయం తీసుకుని ఎంపిక చేసుకోవాలి. అయితే టెస్టు క్రికెట్ ఎవర్‌గ్రీన్. అదేవిధంగా టీ20 లీగ్‌లు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ఇక పోతే వన్డే ఫార్మాట్ మూడో స్థానానికి పడిపోయింది’’ అని ఖవాజా వివరించాడు. ఉస్మాన్ ఖవాజా ఆసీస్ తరఫున కేవలం 40 వన్డేల్లో మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు. చివరిసారిగా 2019లో వన్డే మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం టెస్టుల్లో ఓపెనర్‌గా కొనసాగుతున్నాడు.
ఇదీ చదవండి:అదరగొట్టిన ధావన్, గిల్.. ఉత్కంఠ పోరులో భారత్ విజయం