Pollard Missing: వెస్టిండీస్ సారథి కీరన్ పొలార్డ్‌ను దారుణంగా ట్రోల్ చేశాడు అతడి సహచరుడు డ్వేన్ బ్రావో. 'పొలార్డ్ మిస్సింగ్' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. మోదీ స్టేడియంలో భారత్‌తో మూడో వన్డే జరగనున్న నేపథ్యంలో ఈ పోస్ట్ కాస్త వైరల్ అవుతోంది.
భారత్‌తో తొలి వన్డేలో చాహల్ బౌలింగ్‌లో మొదటి బంతికే ఔటై గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు పొలార్డ్. అనంతరం గాయం కారణంగా రెండో వన్డేలో అతడు ఆడలేదు. మూడో వన్డేలోనూ పొలార్డ్ ఆడటంపై అనుమానాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అతడిని ఓ ఆట ఆడుకున్నాడు బ్రావో.
"ఇది నిజంగా దుర్దినం. నా బెస్ట్ ఫ్రెండ్ కీరన్ పొలార్డ్ కనిపించడం లేదు. అతడెక్కడున్నాడో మీకెవరికైనా తెలిస్తే.. ఆ సమాచారాన్ని నాకు లేదా పోలీసులకు అందజేయండి." అని ఫన్నీగా ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చాడు బ్రావో. దాంతో పాటు అతడు చివరిసారిగా చాహల్ జేబులో కనిపించాడని పేర్కొన్నాడు.