స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అలియాస్ డీజే బ్రావో.. టీ20ల్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ ఫార్మాట్లో 500 మ్యాచ్‌లాడిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు కీరన్ పొలార్డ్ ఈ ఘనత సాధించాడు.
బుధవారం జరిగిన సీపీఎల్ ఫైనల్లో సెయింట్ కీట్స్ అండ్ నెవిస్ పేట్రియట్కు కెప్టెన్సీ వహించిన బ్రావో.. ఈ మార్క్‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఈ జట్టే విజేతగా నిలిచింది. తొలిసారి కప్పును ముద్దాడింది.
2006లో టీ20 అరంగేట్రం చేసిన బ్రావో.. ప్రపంచవ్యాప్తంగా వివిధ జట్లు, పలు లీగ్ల్లోని వివిధ ఫ్రాంచైజీల తరఫున ఆడాడు. టీ20 స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఇతడు.. 2010లో చివరగా టెస్టు.. 2017లో చివరగా వన్డే ఆడటం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయం.