Dunith Wellalage Asia Cup 2023 : భారత్-శ్రీలంక మధ్య పోరు జరుగుతున్న వేళ ఓ 20 ఏళ్ల ఈ శ్రీలంక యువ స్పిన్నర్.. భారత బ్యాటర్లను మామూలుగా ఇబ్బంది పెట్టలేదు. అతని ధాటికి టీమ్‌ఇండియా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో ఈ యంగ్ ప్లేయర్ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. అతనే శ్రీ లంకకు చెందినదునిత్ వెల్లలాగె. మైదానంలో అడుగుపెట్టినప్పటి నుంచి భారత బ్యాటర్లను హడలెత్తించిన దునిత్.. మొత్తంగా 10 ఓవర్లలో 40 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. స్పిన్‌కు స్వర్గధామంలా మారిన పిచ్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్.. భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అలా వరుసగా వికెట్లు పడగొడుతూ భారత్‌కు కళ్లెం వేశాడు. అంతే కాకుండా ఫీల్డింగ్‌లోనూ ఓ మెరుపు క్యాచ్ కూడా అందుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. దీంతో ఫ్యాన్స్ ఈ ప్లేయర్ గురించి నెట్టింట తెగ వెతికేశారు.
లంక జట్టుకు చెందిన దునిత్ గత ఏడాది అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. నిరుడు టీ20 ప్రపంచకప్‌లోనూ తన సత్తా చాటిన వెల్లలాగె.. ఆ పేరు మార్మోగింది. ఆ టోర్నీలో అత్యధిక వికెట్ల (17) వీరుడు అతనే. అంతే కాక 6 మ్యాచ్‌ల్లో 246 పరుగులతో బ్యాటర్‌గానూ సత్తా చాటాడు. ఈ ప్రదర్శనతో అతడికి శ్రీలంక టెస్టు జట్టులో చోటు దక్కింది. తర్వాత వన్డే జట్టులోకీ వచ్చేశాడు. నిలకడగా రాణిస్తూ ప్రపంచకప్ ముంగిట కీలక ఆటగాళ్లలో ఒకడిగా మారాడు. టీమ్‌ఇండియాపై సంచలన ప్రదర్శనతో ఇప్పుడు అందరి దృష్టి అతడిపై పడింది. ప్రపంచకప్ జరగనున్నది భారత్‌లో కావడం వల్ల ఈ స్పిన్ ఆల్‌రౌండర్ టోర్నీపై తనదైన ముద్ర వేయడం ఖాయమనిపిస్తోంది.