Duleep Trophy 2023 : ప్రతిష్ఠాత్మక దులీప్ ట్రోఫీలో హనుమ విహారి సారథ్యంలోని సౌత్ జోన్ ఫైనల్‌కు చేరింది. నార్త్ జోన్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో సమష్టిగా రాణించిన సౌత్ జోన్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. 215 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన సౌత్ జోన్ 36.1 ఓవర్లలో 8 వికెట్లకు 219 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్, టీమ్ఇండియా వెటరన్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ (57 బంతుల్లో 7 ఫోర్లతో 54 పరుగులు) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అతడికి తోడుగా కెప్టెన్ హనుమ విహారీ(42 బంతుల్లో 8 ఫోర్లతో 43 పరుగులు), రికీ భూయ్(29 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34) రాణించారు. హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ(19 బంతుల్లో 2 సిక్స్‌లతో 25) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నార్త్ జోన్ 198 పరుగులకే కుప్పకూలింది. విద్వత్ కావెరప్ప (5/28) ఐదు వికెట్లతో నార్త్ జోన్ పతనాన్ని శాసించాడు. అతడి బౌలింగ్ ధాటికి ప్రభ్ సిమ్రన్ సింగ్(49) మినహా అంతా విఫలమయ్యారు. అనంతరం సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (115 బంతుల్లో 10 ఫోర్లతో 76 పరుగులు), తిలక్ వర్మ(101 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 46 పరుగులు) జట్టును ఆదుకున్నారు. 35 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును మయాంక్ అగర్వాల్ 110 పరుగుల భాగస్వామ్యంతో గట్టెక్కించాడు.
రెండో ఇన్నింగ్స్‌లో నార్త్ జోన్ 211 పరుగులకే ఆలౌటైంది. ప్రభ్ సిమ్రన్ సింగ్(63) హాఫ్ సెంచరీతో రాణించగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఆర్‌సీబీ బౌలర్ విజయ్‌కుమార్ వైశాఖ్(5/76) ఐదు వికెట్లతో సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో సౌత్ జోన్ ముందు 215 పరుగుల లక్ష్యం నమోదైంది. ఆచితూచి ఆడిన సౌత్ జోన్ ఆటగాళ్లు విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు.
ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్ మధ్య జరిగిన తొలి సెమీఫైనల్ ఫలితం తేలకుండా ముగిసింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన వెస్ట్ జోన్‌కు ఫైనల్ బెర్త్ దక్కింది. జులై 12(బుధవారం) నుంచి జరిగే ఫైనల్లో వెస్ట్ జోన్‌తో సౌత్ జోన్ తలపడనుంది.