ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్(WTC Final) రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ క్యాచ్ వదిలేసినప్పుడు మ్యాచ్ చేజారిపోతుందని భయపడ్డానని న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ అన్నాడు. అప్పటికే మ్యాచ్ అత్యంత కఠినంగా సాగుతోందని అతడు పేర్కొన్నాడు. ఐదారు ఓవర్లలోనే మ్యాచ్ గమనాన్నే మలుపు తిప్పగల సామర్థ్యం పంత్కు ఉందని సౌథీ అభిప్రాయపడ్డాడు.
"ఆ క్యాచ్ గురించి నేను బాధపడలేదంటే అవాస్తవమే అవుతుంది. ఎందుకంటే పంత్ ఎంత విధ్వంసకరంగా ఆడతాడో అందరికీ తెలుసు. అతడు ఐదారు ఓవర్లలో మ్యాచ్ను మా నుంచి లాగేసుకోగలడు. అప్పటికే మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. నా బుర్రలో ఎన్నో చెడు ఆలోచనలు తిరిగాయి. కానీ తర్వాతి ఓవర్ వేయాలంటే వాటి గురించి పట్టించుకోవద్దు. ఆ తర్వాత పంత్ ఔటయ్యాక ఊపిరి పీల్చుకున్నా. అదో భయంకరమైన అనుభవం. క్యాచులు వదిలేయడం క్రికెటర్ కెరీర్‌లోనే ఘోరమైంది. అలా చేయడం మన సహచరులను అవమాన పరిచినట్టే అనిపిస్తుంది".