టీమ్ఇండియా లెగ్‌స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రాబోయే శ్రీలంక సిరీస్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. కొద్దికాలంగా అనుకున్నంత మేర రాణించలేకపోతున్న అతను స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ చోటు సంపాదించలేకపోయాడు. ఇప్పుడు లంక పర్యటనకు ఎంపికైన అతడు తన బౌలింగ్‌పై పూర్తి నమ్మకంతో ఉన్నాడు. ఇక్కడ రాణించి తన స్థానం సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నాడు. తాజాగా ఓ క్రీడా ఛానెల్‌తో ముచ్చటించిన చాహల్ పలు విషయాలు పంచుకున్నాడు.
'ఇటీవల నా ప్రదర్శన గురించి మాట్లాడితే నేను ఫామ్ కోల్పోయాయని భావించడం లేదు. మనం ప్రతి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించలేము. ఎప్పుడు ఆడినా నేను అత్యుత్తమ ప్రదర్శన చెయ్యడానికే ప్రయత్నిస్తా. ఈ పర్యటన నాకెంతో ముఖ్యమైనది. నా బౌలింగ్ గురించి ఎప్పుడూ కోచ్‌తో సంప్రదింపులు చేస్తుంటాను. జట్టు యాజమాన్యం నాకెంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. అందుకే నేనిప్పుడు ఇక్కడున్నాను. ఇప్పుడు నా ధ్యాసంతా ఈ సిరీస్‌పైనే ఉంది. ఏడాది కాలంగా క్రికెట్ ఆడటం తక్కువైనా పరిస్థితులు మన చేతుల్లో లేవు. ఇప్పుడు నా అమ్ములపొదిలో మరిన్ని అస్త్రాలున్నాయి. వాటిమీదే దృష్టి సారిస్తున్నాను. ఈ సిరీస్‌లో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న చాహల్‌ను మీరు చూస్తారు' అని అతను పేర్కొన్నాడు.