ఈ ఏడాది రెండో విడత దేశవాళీ టీ20 క్రికెట్ సీజన్ ప్రారంభానికి సంబంధించి ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. సెప్టెంబర్‌లో ప్రారంభం కావాల్సిన సీజన్.. నిర్ణీత సమయానికి సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. కొవిడ్ వల్ల ఐపీఎల్ వాయిదా పడటమే ఇందుకు కారణం. దీంతో అక్టోబర్ 15 తర్వాత సీజన్‌ను ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సజావుగా సాగాల్సిన ఐపీఎల్ 14వ సీజన్ కరోనా వల్ల మే 4న వాయిదా పడింది. దేశంలో వైరస్ కేసులు ఇంకా అదుపులోకి రాకపోవడం వల్ల మిగిలిన టోర్నీని యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. పలువురు దేశవాళీ క్రికెటర్లు ఐపీఎల్లో ఆడుతున్నారు. దీంతో వారు స్వదేశానికి వచ్చాకే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 వంటి టోర్నీలను ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఇక ఐపీఎల్ 15వ సీజన్లో మరో రెండు కొత్త ఫ్రాంఛైజీలు లీగ్‌లోకి అడుగుపెడుతున్నాయి. అందుకు సంబంధించిన వేలం త్వరలోనే ఉండే అవకాశం ఉంది. దీంతో దేశవాళీ క్రికెటర్లకు ముస్తాక్ అలీ వంటి టీ20 టోర్నీలు కీలకం కానున్నాయి. అనుకున్న సమయానికి ఈ సీజన్ ప్రారంభం కాకుంటే యువ క్రికెటర్లలో ఆసక్తి తగ్గే అవకాశం ఉంది.
దురదృష్టం ఏంటంటే, ఇప్పటివరకు దేశీయ సీజన్‌కు సంబంధించి బీసీసీఐ అధికారికంగా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. దేశంలో కొవిడ్ పరిస్థితులు ఇంకా తొలగిపొలేదు. దీంతో టీ20 ప్రపంచకప్ కూడా దేశం నుంచి తరలిపోయింది. కాబట్టి, ఈ సీజన్‌కు సంబంధించి బోర్డు వేచి చూసే ధోరణిని అవలంబిస్తుంది. టీ20లకు సంబంధించి టోర్నీలు సెప్టెంబర్‌లో ఉండే అవకాశాలైతే లేవని చెప్పొచ్చు. ఇక కరోనా కారణంగా గతేడాది రంజీ ట్రోఫీ రద్దు కాగా, ఈ ఏడాది కూడా అది సజావుగా సాగే అవకాశాలు కనిపించడం లేదు.
ఇదీ చదవండి:'ఆర్ఆర్ఆర్' పోస్టర్‌పై కేన్ మామతో వార్నర్