First ODI match: వన్డే మ్యాచ్.. ఈ ఫార్మాట్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు టీ20లు వచ్చి దీనిని కాస్త అణగదొక్కాయి కానీ.. ఒకప్పుడు వన్డేలకు మంచి గిరాకీ ఉండేది. ఇప్పటికీ ఉన్నా.. పొట్టి ఫార్మాట్ వచ్చాక కాస్త తగ్గిందనే చెప్పవచ్చు. అయితే మొట్టమొదటి వన్డే మ్యాచ్‌కు దారితీసిన పరిణామాలేంటో తెలుసా? క్రికెట్ చరిత్రలో తొలి వన్డే మ్యాచ్ జరిగి బుధవారానికి 51 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ మ్యాచ్ ఎప్పుడు, ఏఏ జట్ల మధ్య జరిగిందో తెలుసుకుందాం
అలా మొదలైంది..
క్రికెట్‌లో వన్డే మ్యాచ్‌లు ప్రారంభమవడమే విచిత్రమైన పరిస్థితుల్లో జరిగింది. 1971లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా నిర్వహించాల్సిన ఏడో మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. ఫలితంగా ఇంగ్లాండ్ యాజమాన్యం టెస్టు మ్యాచ్ బదులు 40 ఓవర్ల వన్డే మ్యాచ్ ఆడాలని భావించింది. అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ డాన్ బ్రాడ్‌మన్‌తో పాటు ఆసీస్ మేనేజ్‌మెంట్‌కు విషయాన్ని చెప్పారు. దీనికి వారు కూడా అంగీకరించారు. అయితే దీనికి ఇంగ్లాండ్ ఆటగాళ్లు విముఖత వ్యక్తం చేశారు. వారికి మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు ముందుగా చెప్పకపోవడమే ఇందుకు కారణం. అలా తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జనవరి 5, 1971న జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట ఇంగ్లాండ్ జట్టు 40 ఓవర్లలో కేవలం 190 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌లో విజయం సాధించి తొలి అంతర్జాతీయ వన్డేలో గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది.
తొలి ప్రపంచకప్‌కు బాటలు..
ఈ మ్యాచ్ తర్వాత మళ్లీ 1972లో ఈ రెండు జట్ల మధ్యే రెండో వన్డే జరిగింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టు ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకుంది. ఆ మ్యాచ్ తర్వాత మరికొన్ని దేశాలు వన్డే ఫార్మాట్‌పై ఆసక్తి చూపించాయి. అనంతరం మూడేళ్లకు ప్రొడెన్షియల్ కప్-1975 పేరుతో పరిమిత ఓవర్ల ఫార్మాట్లో తొలి అంతర్జాతీయ ప్రపంచ కప్ నిర్వహించారు. ఈ టోర్నీలో వెస్టిండీస్ విజేతగా నిలిచింది.