తనకు ఇతరుల బుర్రలు చదివే అవకాశం వస్తే టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై ఆ అస్త్రాన్ని సంధిస్తానని అంటున్నాడు వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్. ఇటీవల భారత టీ20 లీగ్ 15వ సీజన్‌లో బెంగళూరు తరఫున మెరిసిన అతడు తిరిగి జాతీయ జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దక్షిణఫ్రికాతో రెండో టీ20కి ముందు బీసీసీఐ విడుదల చేసిన ఓ వీడియోలో మాట్లాడాడు. డీకేని పలు ప్రశ్నలు అడగ్గా.. ఇలా సరదాగా సమాధానాలిచ్చాడు.
ప్రశ్న: జట్టుతో డిన్నర్ చేయడం ఇష్టమా? సినిమాకు వెళ్లడం ఇష్టమా?
డీకే: టీమ్ డిన్నర్ అంటేనే చాలా ఇష్టం. ఆటగాళ్లతో భోజనం చేయడం బాగుంటుంది.
ప్రశ్న: టీ ఇష్టమా? కాఫీ ఇష్టమా?
డీకే: టీ ఇష్టం. భారత దేశంలో ఏ మూలకెళ్లినా దొరుకుతుంది.
ప్రశ్న:ఏదైనా పార్టీలో పాడటం ఇష్టమా? లేక డాన్స్ చేయడం ఇష్టమా?
డీకే: ఇది చాలా కష్టమైన ప్రశ్న. నేను రెండింటిలో ఏదీ చేయలేను.
ప్రశ్న:పర్వత ప్రాంతాలా? బీచ్‌లా?
డీకే: పర్వత ప్రాంతాలే ఇష్టం. నేను ఎక్కడ హిల్‌స్టేషన్‌కు వెళ్లినా.. అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.
ప్రశ్న: వంట చేయడమా? ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడమా?
డీకే: ఇంటిని శుభ్రం చేయడానికే ప్రాధాన్యతనిస్తా. శుభ్రంగా ఉండటం ఇష్టం.
ప్రశ్న: మీకు ఎగిరిపోవడం ఇష్టమా? లేక ఎవరిదైనా బుర్ర చదవడం ఇష్టమా?
డీకే: నాకు ఎగిరిపోయే అవకాశం వస్తే అలస్కా (అమెరికా) వెళ్లిపోతా. ఆ ప్రాంతం గురించి చాలా విషయాలు విన్నాను. అదే ఇతరుల బుర్ర చదివే అవకాశం వస్తే ధోనీ మైండ్‌ను చదివేస్తా.