టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడంపై సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ హర్షం వ్యక్తం చేశాడు. 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించిన అనంతరం దినేశ్.. తన కల నెరవేరిందంటూ సోషల్‌మీడియాలో ట్వీట్ చేశాడు.
కాగా, సోమవారం సాయంత్రం చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమై జట్టు వివరాలను వెల్లడించింది. అంతా ఊహించనట్లుగానే గాయాలతో జట్టుకు దూరమైన బుమ్రా, హర్షల్ పటేల్ పునరాగమనం చేయగా.. ఆసియాకప్ 2022లో విఫలమైన ఆవేశ్ ఖాన్‌పై వేటు పడింది. టీమ్ఇండియా కాంబినేషన్లో భాగంగా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను కూడా టీమ్‌మేనేజ్‌మెంట్ పక్కనపెట్టి స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేసింది. మహ్మద్ షమీ జట్టులోకి వస్తాడని ప్రచారం జరిగినా అతడిని బుమ్రా బ్యాకప్‌గా మాత్రమే సెలెక్టర్లు తీసుకున్నారు. అతడితో పాటు దీపక్ చాహర్, శ్రేయస్ అయ్యర్‌లను స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేసింది.