రాబోయే రెండు టీ20 ప్రపంచకప్‌లలో కనీసం ఒక్కసారైనా టీమ్ఇండియా తరఫున ఆడాలని ఉందని వెటరన్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్(Dinesh Karthik) ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవలే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final) వ్యాఖ్యాతగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన అతను ఫిట్‌నెస్‌తో కొనసాగినంత కాలం క్రికెట్ ఆడతానని స్పష్టం చేశాడు. ఇటీవలే ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఈ సీనియర్ బ్యాట్స్‌మన్.. క్రికెటర్‌గా ఆటపై తనకింకా మక్కువ పోలేదని చెప్పాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో(ICC World Cup 2019) విఫలమవ్వడం వల్లే తనను టీ20 జట్టు నుంచి తప్పించారన్నాడు.
"నేను ఫిట్‌గా ఉన్నంతకాలం క్రికెట్ ఆడాలనుకుంటున్నా. రాబోయే రెండు టీ20 ప్రపంచకప్‌లలో భారత్ తరఫున ఒక్కసారైనా ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నా. 2019 వన్డే ప్రపంచకప్‌లో విఫలమైన నేపథ్యంలో టీమ్‌ఇండియా నుంచి తొలగించేవరకు నాకు ఆ టీ20 జట్టుతో మంచి అనుబంధం ఉంది."
- దినేశ్ కార్తిక్, టీమ్ఇండియా క్రికెటర్
అలాగే రాబోయే ప్రపంచకప్‌లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగే అవకాశముందని దినేశ్ కార్తిక్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 14వ(IPL 2021) సీజన్ రెండో భాగంలో మంచి ప్రదర్శన చేస్తే తుది జట్టులోకి ఎంపికయ్యే వీలుందని అన్నాడు.
"నేనింకా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నా. టీమ్‌ఇండియాకు టీ20ల్లో సరైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ కావాలి. ఇప్పుడు జట్టు నిండా టాప్‌ఆర్డర్ బ్యాట్స్‌మెనే ఉన్నారు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా మినహా మిడిల్ ఆర్డర్‌లో సరైన బ్యాట్స్‌మన్ లేరు. టాప్ ఆటగాళ్లంతా ఐపీఎల్‌లో ఆయా జట్లకు ఒకటి నుంచి మూడు స్థానాల్లోనే బ్యాటింగ్ చేస్తున్నారు. పంత్ ఒక్కడే నాలుగోస్థానంలో కొనసాగుతున్నాడు. అలాంటప్పుడు రాబోయే ఐపీఎల్‌లో రాణిస్తే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది" అని వెటరన్ బ్యాట్స్‌మెన్ తన అభిప్రాయం వెల్లడించాడు.
ఇదిలా ఉండగా, 2004 నుంచి సుదీర్ఘకాలంగా టీమ్‌ఇండియాతో కొనసాగుతున్నా డీకే 2007 వన్డే ప్రపంచకప్, 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఈ నేపథ్యంలోనే కెరీర్ ముగింపు దశలో ఉన్న అతడు చివరగా ఒకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నాడు.
ఇదీ చూడండి..ఐసీసీ సీఈఓ మను సాహ్నీ రాజీనామా