టీమ్ఇండియా యువ ఆటగాడు కృనాల్ పాండ్య (Krunal Pandya) కరోనా వ్యవహారంలో కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి! అతడు గొంతునొప్పి వస్తోందని చెప్పిన వెంటనే బీసీసీఐ వైద్యుడు (BCCI Doctor) ర్యాపిడ్ టెస్టు చేయలేదట. అంతేకాకుండా జట్టు సమావేశానికీ అనుమతి ఇచ్చాడట. శ్రీలంక పర్యటనతో సంబంధం ఉన్న బీసీసీఐ వర్గాలు ఈ విషయం ధ్రువీకరిస్తున్నాయి.
మొదటి టీ20 తర్వాత కృనాల్ పాండ్యకు కరోనా సోకిందని వార్తలు వచ్చాయి. దీంతో రెండో టీ20ని ఒక రోజు వాయిదా వేశారు. కృనాల్‌తో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మందిని ఐసోలేషన్‌కు పంపించారు. దీంతో జట్టు గెలుపు అవకాశాలు దెబ్బతిన్నాయి. అయితే గొంతునొప్పి అని చెప్పిన వెంటనే వైద్యాధికారి స్పందించి ఉంటే ఇలా జరిగేది కాదేమో!
వాస్తవంగా జులై 26న కృనాల్ పాండ్య తనకు గొంతు నొప్పి వస్తోందని ప్రధాన వైద్యాధికారి అభిజిత్ సల్వీకి చెప్పాడు. నిబంధనల ప్రకారం ఆరోజు అతడికి ర్యాపిడ్ టెస్టు చేయలేదు. పైగా జట్టు సమావేశంలో పాల్గొనేందుకు అతడికి అనుమతి ఇచ్చాడు. మరుసటి రోజైన 27న ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేశాడు. ఫలితాలు మధ్యాహ్నం వచ్చాయి. దీంతో మ్యాచును వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ, ఎస్‌ఎల్‌సీ ప్రకటించాయి. మిగతా ఎనిమిది మందికీ పరీక్షలు చేశారు. జట్టంతా నెగెటివ్ అనే వచ్చింది. ఆలస్యంగా తెలిసిన విషయం ఏంటంటే.. శ్రీలంక నుంచి బయల్దేరే ముందు కృష్ణప్ప గౌతమ్, యుజ్వేంద్ర చాహల్‌కు పాజిటివ్ వచ్చింది.