Dhruv Jurel Team India:ఉత్తర్‌ప్రదేశ్ యంగ్ ప్లేయర్ ధ్రువ్ జురెల్‌కు టీమ్ఇండియా పిలుపు అందింది. టీమ్ఇండియా జనవరి 25 నుంచి స్వదేశంలో ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు 15 మందితో కూడిన జట్టును సెలక్షన్ కమిటీ శుక్రవారం రాత్రి ప్రకటించింది. ఈ జట్టులో జురెల్ స్థానం దక్కించుకున్నాడు. అయితే తొలిసారి టీమ్ఇండియాకు ఎంపికైన తర్వాత జురెల్ తన క్రికెట్ జర్నీ గురించి చెప్పాడు. చిన్నప్పుడు తన తల్లి బంగారు చైన్ అమ్మేసి క్రికెట్ కిట్ కొన్న విషయాన్ని జురెల్ గుర్తుచేసుకున్నాడు.
'నేను ఆర్మీ స్కూల్‌లో చదివాను. హాలీడెస్లో ఆగ్రాలోని ఏకలవ్య స్టేడియంలో క్రికెట్ క్యాంప్‌లో చేరాలనుకున్నా. దానికి నాన్నకు తెలియకుండా అప్లై కూడా చేశా. కానీ, నాన్నకు తెలిసిన తర్వాత ఆయన తిట్టారు. అయినప్పటికీ రూ.800 అప్పుచేసి నాకు బ్యాట్ కొనిచ్చారు. తర్వాత ఒకసారి నేను క్రికెట్ కిట్ కావాలని అడిగా. ఎంత ఖరీదు ఉంటుందని అడిగితే, రూ.6 -7 వేలు అవుతుందన్నా. దీంతో నాన్ని క్రికెట్ మానేయమన్నారు. ఆ బాధతో బాత్రూమ్లోకి వెళ్లి తలుపు లాక్ చేసుకున్నా. తర్వాత మా అమ్మ తన బంగారు గొలుసు అమ్మి, నాకు క్రికెట్ కిట్ కొనిచ్చింది' అని జురెల్ అప్పటి రోజులను గుర్తు చేసుకున్నాడు.
'నేను టీమ్ఇండియాకు ఎంపికైనట్లు ఫ్రెండ్స్ చెప్పారు. ఈ విషయం ఇంట్లో చెప్పగానే ' ఏ ఇండియన్ టీమ్‌కు సెలెక్ట్ అయ్యావు?' అని అడిగారు. రోహిత్ భయ్యా, విరాట్ భయ్యా ఉన్న భారత జట్టుకు అని చెప్పాను. ఇది విని నా ఫ్యామిలీ ఎమోషనల్ అయ్యింది' అని జురెల్ పేర్కొన్నాడు.